Revanth Reddy: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది కాలంలోనే కేబినెట్ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నట్లు రాజకీయ వర్గాలలో జోరుగా ప్రచారం సాగుతోంది. అధిష్ఠానం మంత్రుల పనితీరుపై తీవ్ర అసంతృప్తితో ఉందని, త్వరలో జరగబోయే కీలక మార్పులతో పలువురు మంత్రులు తమ పదవులను కోల్పోయే ప్రమాదం ఉందని తెలుస్తోంది.
‘పెర్ఫార్మెన్స్’ రిపోర్ట్‌తో మంత్రులకు వణుకు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వంపై పూర్తి పట్టు సాధించే క్రమంలో కాంగ్రెస్ హైకమాండ్, మంత్రుల పనితీరుపై సమగ్ర నివేదికను తెప్పించుకుంది. ఆ నివేదికలో సంతృప్తికరంగా లేని మంత్రుల జాబితా ఆధారంగా ప్రక్షాళన ఉంటుందని సమాచారం. పనితీరు మార్చుకోవాలని ఇప్పటికే హెచ్చరికలు అందినట్లు తెలుస్తోంది.
ఈలోపే, కేబినెట్‌లో బెర్తు కోసం సీనియర్ నాయకుల లాబీయింగ్ జోరందుకుంది. ముఖ్యంగా బీసీ కోటాలో మధుయాష్కి, అంజన్ కుమార్, విప్‌లు ఆది శ్రీనివాస్, బీర్ల అయిలయ్య పోటీ పడుతుంటే, ఎస్టీ కోటాలో బాలు నాయక్, రామచంద్రునాయక్ వంటి ఎమ్మెల్యేలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత మంత్రుల శాఖల్లో మార్పులు, చేర్పులు ఖాయమనే టాక్ బలంగా నడుస్తోంది.
కాంగ్రెస్ ‘ప్లాన్ B’
మరోవైపు, లోక్‌సభ ఎన్నికల్లో బీసీ వర్గం నుంచి ఆశించిన మద్దతు లభించకపోవడం, రాష్ట్రంలో బీసీ జనాభా అధికంగా ఉండటం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ అధిష్ఠానం ఒక సరికొత్త వ్యూహాన్ని అమలు చేయాలని యోచిస్తోంది.
ప్రస్తుతం మల్లు భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగా ఉండగా, త్వరలోనే మరో బీసీ నేతకు ఉప ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టాలని కాంగ్రెస్ సీనియర్ నాయకత్వం భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుత పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ను కేబినెట్‌లోకి తీసుకుని, మరొక బీసీ నేతను పీసీసీ చీఫ్‌గా నియమించే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఈ పదవికి పొన్నం ప్రభాకర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. రేవంత్ రెడ్డికి సన్నిహితుడు, బీసీ వర్గంలో పట్టు ఉన్న యువనేతగా మహేష్ గౌడ్‌కు కేబినెట్‌లో అవకాశం దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
బీసీ వర్గాన్ని సంతృప్తి పరచడానికి ఇప్పటికే రిజర్వేషన్ల పెంపునకు ప్రయత్నించినా, న్యాయపరమైన చిక్కులు, కేంద్రం జోక్యంతో అది పెండింగ్‌లో పడింది. దీంతో ప్లాన్-బీలో భాగంగా డిప్యూటీ సీఎం బాధ్యతను అప్పగించడం ద్వారా బీసీలకు ప్రాధాన్యతనిస్తున్నామనే సందేశాన్ని కాంగ్రెస్ ఇవ్వజూస్తోంది.
వచ్చే పార్లమెంట్ ఎన్నికల నాటికి తెలంగాణలో అమలు చేసే ఈ విధానాన్ని దేశవ్యాప్తంగా ప్రచారం చేసుకొని, జాతీయ రాజకీయాలకు తెలంగాణను ఒక ఆదర్శ రాష్ట్రంగా మార్చడానికి కాంగ్రెస్ పావులు కదుపుతోంది. మొత్తంగా, తెలంగాణ రాజకీయాలు మంత్రివర్గ ప్రక్షాళన, బీసీ సమీకరణాల చుట్టూ వేడెక్కుతున్నాయి.


