Caste Certificate With Aadhaar In Telangana: ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగే పనిలేదు.. రోజుల తరబడి నిరీక్షణకు స్వస్తి. కుల ధ్రువీకరణ పత్రం కోసం ఇకపై గంటల తరబడి మీ-సేవా కేంద్రాల్లో వేచి ఉండాల్సిన అవసరం లేదు. కేవలం రెండు నిమిషాల్లో, మీ ఆధార్ నంబర్‌తోనే కుల ధ్రువీకరణ పత్రాన్ని పొందే అద్భుతమైన సౌకర్యాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఈ నూతన విధానంతో లక్షలాది మందికి లబ్ధి చేకూరనుంది. ఇంతకీ, ఈ సులభతర విధానం ఎవరికి వర్తిస్తుంది..? కేవలం ఆధార్ నంబర్ చెబితేనే సర్టిఫికెట్ ఎలా ఇస్తారు…? ఈ ప్రక్రియ వెనుక ఉన్న సాంకేతికత ఏమిటి…?
పాత పత్రం ఉంటే చాలు.. క్షణాల్లో కొత్తది మీ చేతిలో:
ప్రభుత్వం తీసుకున్న ఈ విప్లవాత్మక నిర్ణయంతో, గతంలో కుల ధ్రువీకరణ పత్రం పొంది, దానిని పునరుద్ధరించుకోవాలనుకునే (రీప్రింట్) వారికి ప్రక్రియ అత్యంత సులభతరం కానుంది. గతంలో, ఒకసారి తీసుకున్న కుల ధ్రువీకరణ పత్రాన్ని మళ్లీ పొందాలంటే, మరోసారి దరఖాస్తు ఫారం, ఆధార్ కార్డు, సంఘం సర్టిఫికెట్, పాత కుల ధ్రువీకరణ పత్రం, రేషన్ కార్డు వంటి అనేక పత్రాలను జతపరిచి, అఫిడవిట్ చేయించి మీ-సేవాలో దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చేది. ఈ ప్రక్రియ పూర్తికావడానికి వారం నుంచి పదిహేను రోజుల సమయం పట్టేది.
కానీ, ఇప్పుడు ఆ సమస్యలకు ప్రభుత్వం చెక్ పెట్టింది. మీ-సేవా ఈడీఎం దేవేందర్ వెల్లడించిన వివరాల ప్రకారం, గతంలో ఒక్కసారైనా కుల ధ్రువీకరణ పత్రం తీసుకున్న వారు, ఇప్పుడు నేరుగా మీ-సేవా కేంద్రానికి వెళ్లి, రూ. 45 రుసుము చెల్లించి తమ ఆధార్ నంబర్‌ను చెబితే చాలు. వారి వివరాలు ఇప్పటికే ప్రభుత్వ డేటాబేస్‌లో నిక్షిప్తమై ఉండటంతో, కేవలం రెండు నిమిషాల్లోనే కొత్త కుల ధ్రువీకరణ పత్రాన్ని ప్రింట్ తీసుకుని అందిస్తారు. కులం అనేది మారని అంశం కాబట్టి, ఈ సౌలభ్యాన్ని ప్రభుత్వం కల్పించింది.
వీరికి వర్తించదు: అయితే, ఈ శీఘ్రగతిన సర్టిఫికెట్ పొందే విధానం ఎస్సీ (హిందూ) సామాజిక వర్గానికి చెందిన వారికి వర్తించదని అధికారులు స్పష్టం చేశారు. వారు యధావిధిగా పాత పద్ధతిలోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
మీ-సేవాలో మరిన్ని కొత్త సేవలు:
ప్రజలకు మరింత మెరుగైన, వేగవంతమైన సేవలను అందించే లక్ష్యంతో ప్రభుత్వం మీ-సేవా పరిధిని విస్తరించింది. గతంలో ప్రైవేటు వెబ్‌సైట్లలో అందుబాటులో ఉన్న పలు సేవలను ఇప్పుడు మీ-సేవాలోకి తీసుకొచ్చింది. వీటిలో ప్రధానంగా రెవెన్యూ, ఫారెస్ట్, సంక్షేమ శాఖలకు సంబంధించిన సేవలు ఉన్నాయి.
కొత్తగా చేరిన సేవలు:
గ్యాప్ సర్టిఫికేట్, సీటీజన్ నేమ్ చేంజ్, స్థానికత, మైనార్టీ, క్రిమిలేయర్, నాన్ క్రిమిలేయర్, సీనియర్ సిటిజన్ సర్టిఫికెట్లు, హిందూ వివాహ ధ్రువీకరణ పత్రం, పాన్ కార్డు చేంజెస్, ఇసుక బుకింగ్ వంటి అనేక కీలక సేవలు ఇకపై మీ-సేవా కేంద్రాల ద్వారానే పొందవచ్చు. ఈ నూతన విధానాల ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజల ముంగిటకు తీసుకురావడం, జాప్యాన్ని నివారించి, పారదర్శకతను పెంచడమే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది.


