Children’s screen time effects : ఒకప్పుడు గోరుముద్దల కోసం చందమామను చూపించే అమ్మ, ఇప్పుడు యూట్యూబ్ వీడియోలను చూపిస్తోంది. అల్లరి చేస్తే, లాలిపాటతో బుజ్జగించే నాన్న, ఇప్పుడు చేతిలో సెల్‌ఫోన్ పెట్టి ఊరుకోబెడుతున్నాడు. స్కూల్ నుంచి రాగానే పుస్తకాలు పక్కన పడేసి, పిల్లలు ఫోన్లలో మునిగిపోతున్నారు. ఈ డిజిటల్ లాలింపు వెనుక, మన చిన్నారుల బాల్యం ఎలా చిదిగిపోతోందో గమనిస్తున్నామా..? ఈ స్క్రీన్ వ్యసనం వారి మెదడుపై, కళ్లపై, చివరికి వారి భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతోంది..? ఈ ప్రమాద ఘంటికలను మనం వింటున్నామా..? నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం…
చేతిలో ఫోన్… చేజారిన బాల్యం: కరోనా తర్వాత ఆన్‌లైన్ క్లాసులతో మొదలైన స్క్రీన్ సమయం, ఇప్పుడు నియంత్రణ లేని వ్యసనంగా మారింది. పిల్లలను బుజ్జగించడానికి, వారిని కాసేపు తమ పనులకు అడ్డులేకుండా చూసుకోవడానికి తల్లిదండ్రులే వారికి సెల్‌ఫోన్లను అలవాటు చేస్తున్నారు.
షాకింగ్ గణాంకాలు: నగరాల్లో 5 ఏళ్లలోపు పిల్లలు రోజుకు సగటున 2.20 గంటలు స్క్రీన్ ముందు గడుపుతున్నారు. 9-17 ఏళ్ల పిల్లల్లో 60% మంది రోజుకు దాదాపు 3 గంటలు మొబైల్ గేమ్స్‌కే అంకితమవుతున్నారు.
వర్చువల్ ఆటిజం: కరోనా తర్వాత నగరాల్లో ‘వర్చువల్ ఆటిజం’ (మాటలు ఆలస్యంగా రావడం, ఇతరులతో కలవకపోవడం) కేసులు 3-4 రెట్లు పెరిగాయని నిపుణులు చెబుతున్నారు.
తెర వెనుక పొంచి ఉన్న ముప్పులు: ఈ డిజిటల్ వ్యసనం పిల్లలపై శారీరకంగా, మానసికంగా తీవ్ర ప్రభావం చూపుతోంది.
కంటి సమస్యలు: 2050 నాటికి సగం మంది పిల్లలు ‘మయోపియా’ (దూరంగా ఉన్న వస్తువులు కనిపించకపోవడం) బారిన పడే ప్రమాదం ఉంది.
మానసిక ఎదుగుదలపై ప్రభావం: భాషాభివృద్ధి, జ్ఞాపకశక్తి, సృజనాత్మక నైపుణ్యాలు దెబ్బతింటాయి.
శారీరక సమస్యలు: చిన్నవయసులోనే మధుమేహం, గుండె సమస్యలు, రక్తపోటు, ఊబకాయం వంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది.
దేశవ్యాప్తంగా ‘డిజిటల్ డీ-అడిక్షన్’ కార్యక్రమాలు: ఈ సమస్య తీవ్రతను గుర్తించిన పలు రాష్ట్రాలు, సంస్థలు పిల్లలను కాపాడేందుకు ముందుకు వస్తున్నాయి.
కేరళ: డిజిటల్ డీ-అడిక్షన్ ప్రోగ్రామ్ (డి-డాడ్)
కర్ణాటక: బియాండ్ స్క్రీన్ ఇనిషియేటివ్
సీబీఎస్‌ఈ: దోస్త్ ఫర్ లైఫ్ యాప్ (గేమింగ్ వ్యసనంపై సలహాలు)
తల్లిదండ్రులే పరిష్కారం… ‘తెర’ వేయండిలా : పిల్లలను ఈ వ్యసనం నుంచి బయటపడేయడంలో తల్లిదండ్రుల పాత్రే కీలకమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
నో-స్క్రీన్ జోన్: రెండేళ్లలోపు పిల్లలకు ఫోన్లు, ట్యాబ్‌లు పూర్తిగా ఇవ్వవద్దు.
20-20-20 నియమం: పిల్లలు స్క్రీన్ చూస్తున్నప్పుడు, ప్రతి 20 నిమిషాలకు, 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును 20 సెకన్ల పాటు చూడమని చెప్పాలి. ఇది కళ్లపై ఒత్తిడిని తగ్గిస్తుంది.
ప్రత్యామ్నాయాలు చూపండి: వారిని ఆరుబయట ఆటలకు ప్రోత్సహించండి. వారితో కలిసి కథలు చదవడం, బొమ్మలు గీయడం, పజిల్స్ పూర్తి చేయడం వంటివి చేయండి.
సమయం కేటాయించండి: వారితో మాట్లాడండి. స్కూల్ విశేషాలు అడగండి. వంటగదిలో చిన్న చిన్న పనుల్లో సహాయం చేయమని కోరండి. మీ సమయమే వారికి సెల్‌ఫోన్‌కు ప్రత్యామ్నాయం.
పిల్లలకు సెల్‌ఫోన్ వాడితే కలిగే నష్టాలను ప్రేమగా వివరించాలి. వారి భవిష్యత్తు మన చేతుల్లోనే ఉందని గుర్తుంచుకుని, డిజిటల్ వ్యసనానికి ‘తెర’ వేయాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది.


