హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన నిర్వహించిన సీఎల్పీ సమావేశం(CLP meeting) ముగిసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా దాదాపు ఐదున్నర గంటల పాటు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలు కూడా హాజరయ్యారు.
ఈ సమావేశంలో ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) తెలిపారు. ఈ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికలు, ఎస్సీ వర్గీకరణ, కులగణన సర్వే, బడ్జెట్, సంక్షేమ పథకాల అంశాలపై ప్రధానంగా చర్చించామని తెలిపారు. ఎవరైనా నేతలు పార్టీ నిర్ణయాలను వ్యతిరేకిస్తే కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. పథకాలను ప్రజలకు వివరించాలని సీఎం సూచించారని పేర్కొన్నారు. కులగణనపై విపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని సూచించామన్నారు.
ఎమ్మెల్యేలు కూడా వారి అభిప్రాయాలను తెలియజేశారని చెప్పారు. ముఖ్యంగా స్థానిక ఎన్నికల వ్యూహంపై చర్చించామని తెలిపారు. రాష్ట్ర ఆదాయం, అప్పులు, వ్యయంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించామన్నార. కులగణ సర్వేపై ప్రజలకు వివరించేందుకు ఫిబ్రవరిలో రెండు బహిరంగ సభలు నిర్వహిస్తామన్నారు. ఈ బహిరంగ సభలకు ఢిల్లీకి వెళ్లి అధిష్టానం పెద్దలను ఆహ్వానిస్తామని వెల్లడించారు.