Telangana CM for speeding up land acquisition: జాతీయ రహదారుల విస్తరణలో భాగంగా భూములు కోల్పోయిన రైతాంగానికి సీఎం రేవంత్ గుడ్‌న్యూస్ చెప్పారు. భూములు కోల్పోయిన రైతులకు వెంటనే పరిహారం అందించి.. అక్టోబరు నెలాఖరు నాటికి పూర్తిస్థాయిలో భూసేకరణ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలోని జాతీయ రహదారులకు సంబంధించిన ప్రాజెక్టులపై ఇవాళ (సోమవారం) సెక్రటేరియట్‍లో ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రోడ్ డెవలప్‍మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్‍రెడ్డి రాంరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. వివిధ జిల్లాల కలెక్టర్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఆయా జిల్లాల్లో జాతీయ రహదారుల నిర్మాణాల కోసం పెండింగ్‍లో ఉన్న భూసేకరణ ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని సంబంధిత జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. భూములు కోల్పోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని కోరారు.
Also Read: https://teluguprabha.net/national-news/new-portal-for-gst-complaints/
ట్రిపుల్‌ఆర్ నిర్వాసితులకు ఎకరానికి ఎంతంటే?
ఈ సందర్భంగా రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర, దక్షిణ భాగాలతో పాటు రేడియల్ రోడ్ల నిర్మాణంపై అధికారులకు పలు సూచనలు చేసిన సీఎం.. ఇందుకు పెండింగ్ భూసేకరణ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. మరోవైపు, హైదరాబాద్ నుంచి బందరు పోర్టు వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం అంశంపై సమీక్షలో చర్చించిన సీఎం.. వీలైనంత త్వరగా రూట్ మ్యాప్ తయారు చేసి పనులు మొదలు పెట్టాలని అధికారులను సూచించారు. హైదరాబాద్- శ్రీశైలం హైవేలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్రం నుంచి వీలైనంత త్వరగా అనుమతులు తీసుకోవాలని కోరారు. కాగా, సీఎం ఆదేశాలతో హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం పంపిణీ ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానుంది. ట్రిపుల్‌ఆర్ ఉత్తర భాగంలోని నిర్వాసితులకు ఎకరాకు రూ.42 లక్షల వరకు పరిహారం అందించనున్నారు. తొలి విడతలో రూ.13 నుంచి రూ.15 లక్షలు, రెండో విడతలో రూ. 22 నుంచి రూ. 25 లక్షల వరకు చెల్లించనున్నారు. త్వరలోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. పరిహారం పంపిణీకి వీలుగా అధికారులు గ్రామాల్లో ఆర్బిట్రేషన్ కోసం నిర్వాసితుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. కలెక్టర్, ఆర్బిట్రేషన్ అథారిటీ అధికారి పేరుతో రూపొందించిన దరఖాస్తులపై రైతుల సంతకాలు సేకరించే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ సమయంలో రైతుల బ్యాంకు ఖాతా, ఆధార్ వివరాలను సేకరిస్తున్నారు. భూసేకరణ చట్టం ప్రకారం.. రైతుల భూమి విస్తీర్ణం, అందులోని నిర్మాణాలు, చెట్లు, బోర్లు, తోటలు, ఇళ్లు, ఇతరత్రా ఆస్తులకు చెల్లించే మొత్తం గురించి రైతులకు తెలియజేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే భూములు కోల్పోతున్న రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తామని అధికారులు చెబుతున్నారు.


