తెలంగాణలో విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా.. నాణ్యతమైనది అందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యుత్ శాఖపై శుక్రవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించిన ఆయన, రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్, భవిష్యత్ అవసరాలు, ప్రభుత్వం చేపట్టనున్న ప్రాజెక్టుల విద్యుత్ వినియోగం తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించారు. ఈ ఏడాది విద్యుత్ డిమాండ్ అత్యధికంగా 17,162 మెగావాట్లకు చేరిందని, ఇది గత ఏడాదితో పోలిస్తే 9.8 శాతం అధికమని అధికారులు సీఎంకు తెలిపారు. వచ్చే ఏడాది ఈ డిమాండ్ 18,138 మెగావాట్లకు పెరిగే అవకాశం ఉందని, 2034–35 నాటికి ఇది 31,800 మెగావాట్లను దాటి పోతుందని అంచనా వేశారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోయే నీటిపారుదల ప్రాజెక్టులు, రైల్వే లైన్లు, మెట్రో, ఇతర మాస్ ట్రాన్స్‌పోర్ట్ ప్రణాళికలు ఇవన్నీ విద్యుత్ డిమాండ్‌ను మరింతగా పెంచబోతున్నాయని సీఎం పేర్కొన్నారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని ఇతర నగరాల్లో డేటా సెంటర్లు, పారిశ్రామిక వాడలు ఏర్పాటయ్యే క్రమంలో వాటికీ అవసరమైన విద్యుత్ వనరులపై అధికారులు ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు.
హైదరాబాద్‌ను భవిష్యత్తులో డేటా సెంటర్ల కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో డేటా సిటీ ఏర్పాటు చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. రీజనల్ రింగ్ రోడ్డులో నిర్మించే శాటిలైట్ టౌన్‌షిప్‌లకు అవసరమైన విద్యుత్ వనరులపై హెచ్ఎండీఏతో సమన్వయం చేసుకోవాలని అధికారులకు సూచించారు. ఫ్యూచర్ సిటీలో విద్యుత్ వ్యవస్థ పూర్తిగా భూగర్భంగా ఉండాలన్నారు. విద్యుత్ టవర్లు, లైన్లు, పోల్స్ బయట కనిపించకుండా ఆధునికంగా రూపొందించాలని చెప్పారు. అక్కడి హైటెన్షన్ లైన్లను కూడా తరలించాల్సి ఉంటుందని తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో స్మార్ట్ పోల్స్‌ను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేయాలని చెప్పారు. మొదటిగా సచివాలయం, నెక్లెస్ రోడ్, కేబీఆర్ పార్కు వంటి ప్రాంతాల్లో అమలుకు చర్యలు ప్రారంభించాలని ఆదేశించారు.
ఔటర్ రింగ్ రోడ్డులో 160 కిలోమీటర్ల పొడవున సోలార్ విద్యుత్ ఉత్పత్తి సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాలని సూచించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని పుట్‌పాత్‌లు, నాలాల్లోనూ సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసే అవకాశాలు పరిశీలించాలని సూచించారు. విద్యుత్ డిమాండ్ పెరుగుదల నేపథ్యంలో రాష్ట్రంలో సబ్ స్టేషన్లను అప్‌గ్రేడ్ చేయడం, విద్యుత్ లైన్ల ఆధునీకరణకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సీఎం తెలిపారు. విద్యుత్ రంగాన్ని భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలని అధికారులకు స్పష్టం చేశారు.


