కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కిషన్ రెడ్డి బెదిరింపులకు భయపడమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కిషన్ రెడ్డి కారణంగానే.. రాష్ట్రానికి ప్రాజెక్టులు రావడం లేదని విమర్శించారు. గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన సీఎం.. కిషన్ రెడ్డి, కేంద్ర ప్రభుత్వం తీరుపైనా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కిషన్ రెడ్డి వల్లే రాష్ట్రానికి మెట్రో ప్రాజెక్టు అనుమతి లభించడం లేదన్నారు. తెలంగాణకు ఆయన తీసుకు వచ్చిన ప్రాజెక్టు ఏంటో చెప్పాలి అని డిమాండ్ చేశారు. మీరు బెదిరిస్తే భయపడేవారు ఇక్కడ ఎవరూ లేరని రేవంత్ రెడ్డి అన్నారు. మెట్రో, ఆర్‌ఆర్‌ఆర్ ప్రాజెక్టులను కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని.. సబర్మతి సుందరీకరణను ప్రశంసించిన కిషన్ రెడ్డి మూసీ ప్రక్షాళన ప్రాజెక్టును మాత్రం వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. ప్రధాని మోదీ వ్యక్తిగత ఆస్తులను తాము అడగడం లేదని.. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులను మాత్రమే అడుగుతున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిధులన్నీ యూపీ, బీహార్‌లకే ఇస్తోందని విమర్శించారు.
ఇక తెలంగాణలో ప్రాజెక్టుల గురించి కేంద్రమంత్రి వర్గంలో ఎప్పుడైనా ప్రస్తావించారా.. అంటూ రేవంత్ ప్రశ్నించారు. ఇప్పటివరకు ఎన్ని ప్రాజెక్టులను మీరు రాష్ట్రానికి సాధించారో చెప్పాలన్నారు. తెలంగాణ కోసం కేంద్రాన్ని ఏం అడిగారో చెప్పండని డిమాండ్ చేశారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి చిత్తశుద్ధి లేదని తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని అన్నారు. చిత్తశుద్ధిని నిరూపించుకోవాలంటే ఈ ప్రాజెక్టులన్నింటికీ అనుమతులు తీసుకొని హైదరాబాద్‌కు రావాలన్నారు. గతంలో ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఎన్ని కోట్ల మందికి ఇచ్చారో చెప్పాలన్నారు. తెలంగాణలో కేంద్రం ఎన్ని ఇళ్లు ఇచ్చిందో చెప్పాలన్నారు. రైతులకు నల్ల చట్టాలు తీసుకొచ్చి కేంద్రం వందల మందిని బలి తీసుకుందని విమర్శించారు.
బలవంతంగా భాషను రుద్దొద్దు: తెలుగు భాష పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని కిషన్ రెడ్డి అన్నారు. ఏ రాష్ట్రంపైనా ఒక భాషను బలవంతంగా రుద్దొద్దని ఆయన తెలిపారు. ప్రభుత్వం అన్ని జీవోలను తెలుగులో కూడా ఇస్తోంది. డీలిమిటేషన్ వల్ల దక్షిణాదిలో ఎంపీ సీట్లు తగ్గవని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెబుతున్నారు. సీట్లు తగ్గవు అంటున్నారు.. కానీ పెరుగుతాయని మాత్రం ఎక్కడా చెప్పట్లేదన్నారు. డీలిమిటేషన్ పేరిట దక్షిణాదికి అన్యాయం చేసేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని విమర్శించారు. ఉత్తరాదిలో సీట్లు పెంచుకొని ఆ రాష్ట్రాల సీట్లతోనే అధికారంలోకి రావాలని బీజేపీ చూస్తోందని పేర్కొన్నారు. ఇప్పటికే నిధులన్నీ ఉత్తరాది రాష్ట్రాలకు ఇస్తూ.. దక్షిణాదికి అన్యాయం చేస్తున్నారని విమర్శించారు.