CM KCR School: పైన ఫోటో చూశారు కదా.. అదేదో ఇంద్రభవనంలా.. తాజమహల్ లా కనిపిస్తున్న ఈ భవనం ఓ పాఠశాల భవనం. అలా అని అదేదో కార్పొరేట్ పాఠశాల భవనం అనుకోవచ్చు. కాదు.. అది ఓ ప్రభుత్వ పాఠశాల. ఔను.. తెలంగాణ సీఎం కేసీఆర్ చదువుకున్న దుబ్బాక పాఠశాల ఇదే. అంతకు ముందు శిథిలావస్థకు చేరుకున్న భవనాన్ని చూసిన సీఎం ఈ పాఠశాలకు మహర్దశ పట్టేలా చేశారు. దాదాపు రూ.11 కోట్లతో ఈ భవన నిర్మాణం జరిగింది.
సీఎం కేసీఆర్ ఈ స్కూల్ బిల్డింగ్ కు 2016 శంఖుస్థాపన చేసి గెలాక్షీ కనస్ట్రక్షన్ సంస్థకు బాధ్యత అప్పజెప్పారు. అయితే.. ఇది మూడేళ్ళ క్రితమే నిర్మాణం పూర్తవగా.. సీఎం చేతుల మీదుగా ప్రారంభించాలని అప్పటి నుండి ఎదురుచూస్తూ వచ్చారు. కానీ.. చివరికి ఈ మధ్యనే సాదాసీదాగా విద్యార్థులు, ఉపాధ్యాయులు భవనంలోకి అడుగుపెట్టి ప్రార్ధనలు నిర్వహించి క్లాసులు మొదలు పెట్టారు. అయితే.. త్వరలోనే పాఠశాలను సందర్శిస్తానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారట.
కాగా, ఈ భవనంలో ఉన్నత పాఠశాల నుంచి జూనియర్, డిగ్రీ కాలేజీ దాకా పిల్లలు ఓకేచోట చదివేలా 28 తరగతి గదులు, మూడు సిబ్బంది గదులు, నాలుగు ల్యాబ్‌లు, స్పోర్ట్ గది, ప్రిన్సిపల్ గది, ల్రైబరీ, కంప్యూటర్ ల్యాబ్, సమావేశ మందిరంతో కూడిన మూడంతస్థుల భవనాన్ని కార్పొరేట్ హంగులతో నిర్మించారు. 250 మంది పిల్లలు ఒకేసారి వినియోగించేలా మరుగుదొడ్లను నిర్మించారు. తాగునీటి కోసం రెండు వాటర్ ట్యాంకులు నిర్మించారు. భవనం కోసం ఓ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేశారు.