Tg HIV Patients Pensions: మానవతా దృక్పథంతో తెలంగాణ ప్రభుత్వం మరోసారి HIV బాధితులకు ఆర్థిక సహాయం అందించడానికి ముందుకు వచ్చింది. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క సోమవారం, 14,084 మంది కొత్త HIV బాధితులకు చేయూత పెన్షన్లను మంజూరు చేస్తూ ఫైల్‌పై సంతకం చేశారు. ఈ పెన్షన్లు లబ్ధిదారులకు జూలై నెల నుండి అందనున్నాయి.
HIV బాధితులు పూర్తిస్థాయిలో పనిచేయలేని స్థితిలో ఉండటం, అలాగే వారికి ప్రతినెలా అధిక వైద్య ఖర్చులు పడుతుండటాన్ని ప్రభుత్వం గుర్తించింది. ఈ పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. పేదరికంతో బాధపడుతున్న HIV బాధితుల జీవన నాణ్యతను మెరుగుపరచడానికి చేయూత పథకం కింద ఈ సహాయం అందించబడుతుంది.
ప్రస్తుతం, ఇప్పటికే 34,421 మందికి నెలకు ₹2,016 చొప్పున పెన్షన్ అందుతోంది. దీని కోసం రాష్ట్రం నెలవారీగా ₹6.93 కోట్లు ఖర్చు చేస్తోంది. 2022 ఆగస్టు తర్వాత HIV కేటగిరీలో కొత్త పెన్షన్లు మంజూరు కాలేదు. అయితే, తాజాగా తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ (TGSACS) ఆధ్వర్యంలో కొత్తగా నమోదు అయిన 14,084 మందికి అర్హతలు నిర్ధారించిన అనంతరం SERP ద్వారా పెన్షన్లు మంజూరయ్యాయి.
జిల్లాల వారీగా లబ్ధిదారుల సంఖ్య:
* హైదరాబాద్: 3,019
* నల్గొండ: 1,388
* ఖమ్మం: 954
* సూర్యాపేట: 931
* కరీంనగర్: 833
* ఆదిలాబాద్: 482
* భద్రాద్రి కొత్తగూడెం: 556
* హన్మకొండ: 825
* జగిత్యాల: 306
* జనగాం: 228
* కామారెడ్డి: 702
* మహబూబ్ నగర్: 452
* నిజామాబాద్: 528
* పెద్ద పల్లి: 567
* సంగారెడ్డి: 1242
* సిద్దిపేట: 527
* వికారాబాద్: 544