Telangana Congress తెలంగాణలో అసలేం జరుగుతోంది. మొన్నటివరకు మంత్రుల మధ్య ఉన్న విబేధాలు కాస్తా ఇప్పుడు నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నాయి. మంత్రి సురేఖ ఓఎస్డీ సుమంత్ ఎపిసోడ్, షాడో మంత్రి రోహిన్ రెడ్డి వ్యవహారం ఇందుకు ఉదాహరణ. అసలేం జరిగింది..పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
తెలంగాణ కాంగ్రెస్‌లో రోజుకో గొడవతో రచ్చ జరుగుతోంది. మంత్రులు పొన్నం ప్రభాకర్ వర్సెస్ అడ్లూరి లక్ష్మన్ కుమార్ వివాదం సమసిపోకముందే మరో సమస్య వచ్చిపడింది. సురేఖ ప్రైవేట్ ఓఎస్డీ సుమంత్ అక్రమ దందాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. డబ్బుల కోసం దెక్కన్ సిమెంట్స్ కంపెనీని బెదిరించాడనే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదులో టాస్క్‌ఫోర్స్ పోలీసులు రంగంలో దిగారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సన్నిహితుడిగా భావిస్తున్న రోహిన్ రెడ్డి ఆఫీసును సుమంత్ దందాలకు ఉపయోగిస్తున్నాడనేది ప్రధాన ఆరోపణగా ఉంది. సుమంత్ కోసం మంత్రి సురేఖ ఇంటికి పోలీసులు వచ్చినప్పుడు ఆమె కుమార్తె సుష్మిత అడ్డుకుంది. పోలీసులతో వాగ్వాదం పెట్టుకుంది. అనంతరం తమపై రేవంత్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు కక్ష గట్టారని ఆరోపించింది. అసలు రేవంత్ రెడ్డి సోదరులు తిరుపతి రెడ్డి, కొండల్ రెడ్డిలకు గన్‌మెన్‌లు ఎందుకంటూ ప్రశ్నించింది.
మరోవైపు రోహిన్ రెడ్డి వర్సెస్ మంత్రి కోమటిరెడ్డి వ్యవహారం కూడా రచ్చరచ్చవుతోంది. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్న కోమటిరెడ్డికి తెలియకుండానే సినిమా రంగానికి సంబంధించిన నిర్ణయాలు జరుగుతున్నాయి. రోహిన్ రెడ్డి షాడో మంత్రిగా వ్యవహరిస్తూ తన శాఖపై పెత్తనం చలాయిస్తుండటంతో కోమటిరెడ్డి ఆగ్రహంగా ఉన్నారు. సినిమా టికెట్ల పెంపు, బెనిఫిట్ షోలు విషయంలో తనకు తెలియకుండా నిర్ణయాలు జరుగుతున్నాయనేది ఆయన ఆరోపణ. ఇటీవల హరిహర వీరమల్లు, ఓజీ సినిమాకు టికెట్ ధరలు పెంచిన సంగతి కూడా తనకు తెలియదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పడం విశేషం. వేతనాల పెంపు కోసం సినీ కార్మికుల సమ్మె నేపధ్యంలో ఇదే రోహిన్ రెడ్డి సినీ ప్రముఖుల్ని నేరుగా రేవంత్ రెడ్డితో సమావేశపర్చారు. ఈ భేటీకు కూడా మంత్రి కోమటిరెడ్డిని పిలవలేదు. ఇలా అన్ని విషయాల్లో కోమటిరెడ్డి ప్రమేయం లేకుండా రోహిన్ రెడ్డి షాడో మంత్రిగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి.
ఇప్పటికే కోమటిరెడ్డి సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ నేరుగా ఆరోపణలు చేశారు. అంటే మంత్రుల మధ్య విబేధాలు కాస్తా ఇప్పుడు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ సాగుతున్నాయి. నెల రోజుల వ్యవధిలో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఉన్న నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరు..నేరుగా రేవంత్ రెడ్డినే టార్గెట్ చేసే స్థాయికి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.


