Saturday, November 15, 2025
HomeతెలంగాణTelangana Congress: తెలంగాణ కాంగ్రెస్‌ ఆపరేషన్‌ ఆకర్ష్‌.. ఆ పాత నేతలు తిరిగి పార్టీలోకి.. ఎవరెవరంటే?

Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్‌ ఆపరేషన్‌ ఆకర్ష్‌.. ఆ పాత నేతలు తిరిగి పార్టీలోకి.. ఎవరెవరంటే?

Telangana Congress Operation Akarsh: తెలంగాణంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ఘర్‌ వాపసీ నినాదాన్ని జపిస్తోంది. ప్రత్యర్థి పార్టీలకు ఛాన్స్‌ ఇవ్వకుండా పార్టీని మరింత పటిష్టం చేసుకునే పనిలో పడింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా ఆపరేషన్‌ ఆకర్ష్‌లో వేగం పెంచాలని తాజాగా డిసైడింది. గతంలో కాంగ్రెస్‌లోనే పనిచేసి ఇతర పార్టీల్లోకి వెళ్లిన సీనియర్లపై ఫోకస్‌ పెట్టింది. వారిని తిరిగి పార్టీలోకి చేర్చుకోవడం ద్వారా ప్రత్యర్థి పార్టీలకు ఊహించని షాక్‌ ఇవ్వాలని చూస్తోంది. సోమవారం టీపీసీసీ ప్రెసిడెంట్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ అధ్యక్షతన జరిగిన విస్తృతస్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. గతంలో పార్టీ వీడిన వారిలో సీనియర్లు ఎవరున్నారు? వారిని మళ్లీ వెనక్కి పిలవడం వల్ల పార్టీకి ఎటువంటి లాభం చేకూరుతుంది? అనే విషయాలపై మళ్లగుల్లాలు పడుతోంది.

- Advertisement -

పార్టీ వీడిన సీనియర్లపై గురి..

ముఖ్యంగా గత అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీని వీడి బీఆర్‌ఎస్‌, బీజేపీలో చేరిన నేతలను కాంగ్రెస్ పార్టీ టార్గెట్‌ చేసింది. వారిని పార్టీలోకి ఆహ్వానించడం ద్వారా ఆయా సెగ్మెంట్లలో బలం పుంజుకోవాలని చూస్తోంది. కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్ దక్కకపోవడం, స్థానికంగా ఇతర నేతలతో విభేదాల కారణంగా కొందరు కాంగ్రెస్‌ ముఖ్య నేతలు పార్టీని వీడాల్సి వచ్చింది. ఇప్పుడు వారందరినీ తిరిగి పార్టీలోకి తీసుకోవాలని డిసైడ్‌ అయ్యారు పార్టీ పెద్దలు. ఈ మేరకు టి.పీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి ప్రతిపాదన పెట్టగా కార్యవర్గం అంతా ఏకగ్రీవంగా ఆమోదం కూడా తెలిపింది. కాంగ్రెస్ పార్టీలో ఏళ్ల తరబడి పనిచేసి ఐడియాలజీ ఉన్న నేతలను చేర్చుకుంటే పార్టీ మరింత బలోపేతమవుతుందని పీసీసీ భావిస్తోంది. దీంతో మళ్లీ పార్టీలోకి ఎంట్రీ ఇచ్చే పాత నేతలెవరనే దానిపై తీవ్ర చర్చ జరుగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల ముందు మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే, పీజేఆర్‌ తనయుడు విష్ణువర్ధన్‌రెడ్డి పార్టీని వీడారు. అంతేకాకుండా, మాజీ మంత్రి దివంగత నేత ముఖేష్‌ గౌడ్‌ తనయుడు విక్రమ్‌గౌడ్‌తో పాటు రాష్ట్ర, జిల్లా స్థాయిలో పలువురు కాంగ్రెస్ నేతలు పార్టీ నుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ నేతలంతా బీఆర్‌ఎస్‌, బీజేపీల్లో కొనసాగుతున్నారు. ఇప్పుడు వీరందరినీ తిరిగి పార్టీలోకి ఆహ్వానించడం ద్వారా ఆయా నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతం అవుతుందని అధిష్టానం భావిస్తోంది.

భట్టి ప్రతిపాదనకు ఆమోదం..

అయితే, ఎన్నికలకు ముందు పార్టీని వీడిన వారిని పార్టీలో చేర్చుకోవడంపై కాంగ్రెస్ పార్టీ ఆచితూచి అడుగులు వేసింది. పాత వారిని పార్టీలోకి తీసుకోవడం ద్వారా ఆయా నియోజకవర్గాల్లో కొత్త నేతలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. అందుకే పాత నేతలను చేర్చుకునే విషయంలో ఆచితూచి వ్యవహరించాలని అధిష్టానం భావిస్తోంది. ఎవరిని పార్టీలోకి తీసుకోవాలి? ఎవరిని తీసుకోవద్దు? ఎవరిని తీసుకుంటే ఎంత లాభం? అనే అంశాలపై అధ్యయనం చేస్తోంది. సోమవారం గాంధీభవన్‌లో జరిగిన టీ పీసీసీ విస్తృత స్థాయి మీటింగ్‌లో ఈ విషయంపై ఓ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే నేతల లిస్ట్‌ రెడీ అయిందని.. ఇక ఆపరేషన్‌ ఆకర్ష్‌ చేపట్టడమే తరువాయిగా గాంధీభవన్‌ వర్గాలు చెబుతున్నాయి. దీంతో కాంగ్రెస్ పాత నేతలకు గాంధీ భవన్ గేట్లు తెరుచుకోబోతున్నాయనే విషయం స్పష్టమవుతోంది. కాగా, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు కావొస్తుంది. అంతేకాకుండా త్వరలో జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు సైతం జరగనున్నాయి. దీంతో సంస్థాగతంగా కాంగ్రెస్ మరింత బలోపేతం కావాలంటే సీనియర్లను తిరిగి పార్టీలోకి చేర్చుకోవాలని అధిష్టానం భావిస్తోంది. అయితే, కాంగ్రెస్‌ ఆపరేషన్‌ ఆకర్ష్‌ ఎంత వరకు వర్కవుట్‌ అవుతుంది? ఎంత మంది మళ్లీ సొంత గూటికి చేరుతారు? పార్టీ మళ్లీ వారికి ఎలాంటి స్థానం కల్పిస్తుంది? అనే విషయాలపై త్వరలోనే స్పష్టత రానుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad