Telangana teacher recruitment re-exam : ప్రకటనలో ఒక మాట, పరీక్షలో మరో బాట.. తెలంగాణ గురుకుల బోర్డు తీరుపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలుగులోనూ పరీక్ష నిర్వహిస్తామని నోటిఫికేషన్‌లో చెప్పి, కేవలం ఆంగ్లంలో మాత్రమే నిర్వహించడాన్ని తప్పుబట్టింది. వేలాది మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ప్రభావితం చేసిన ఈ వ్యవహారంలో రిక్రూట్‌మెంట్ బోర్డు వాదనలను సుప్రీంకోర్టు ఎందుకు తోసిపుచ్చింది? పరీక్ష మళ్లీ నిర్వహించాలని ఆదేశిస్తూ, బాధ్యులైన అధికారుల గురించి చేసిన ఘాటైన వ్యాఖ్యలేంటి..?
తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ రిక్రూట్‌మెంట్ బోర్డు (TREI-RB) 2023లో నిర్వహించిన క్రాఫ్ట్ టీచర్ల నియామక పరీక్ష చెల్లదని, ఆ పరీక్షను మళ్లీ నిర్వహించాల్సిందేనని సుప్రీంకోర్టు సోమవారం స్పష్టమైన తీర్పును వెలువరించింది. నోటిఫికేషన్‌లో పేర్కొన్న నిబంధనలను ఉల్లంఘించడం చెల్లుబాటు కాదని తేల్చిచెప్పింది. ఈ మేరకు హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ గురుకుల బోర్డు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది.
నోటిఫికేషన్‌లో హామీ: గురుకుల బోర్డు 2023, ఏప్రిల్ 5న జారీ చేసిన నోటిఫికేషన్ నెం.07/2023లో క్రాఫ్ట్ టీచర్ల పోటీ పరీక్షను తెలుగు, ఆంగ్లం రెండు భాషల్లో నిర్వహిస్తామని స్పష్టంగా పేర్కొంది.
నిబంధనల ఉల్లంఘన: అయితే, 2023 ఆగస్టు 1న నిర్వహించిన పరీక్షా పత్రాన్ని కేవలం ఆంగ్లంలో మాత్రమే ఇచ్చారు. దీంతో తెలుగు మాధ్యమంలో చదివిన అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారు.
న్యాయపోరాటం: ఈ విషయంపై కొందరు అభ్యర్థులు అధికారులను సంప్రదించినా ఫలితం లేకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం, బోర్డు వైఖరిని తప్పుబడుతూ, పరీక్షను రద్దు చేసి మళ్లీ రెండు భాషల్లో నిర్వహించాలని 2024 ఏప్రిల్ 4న ఆదేశించింది. ఈ తీర్పును బోర్డు డివిజన్ బెంచ్‌లో సవాల్ చేయగా, అక్కడ కూడా చుక్కెదురైంది. డివిజన్ బెంచ్ కూడా సింగిల్ జడ్జి తీర్పును సమర్థిస్తూ, వీలైనంత త్వరగా మళ్లీ పరీక్ష పెట్టాలని 2024 ఏప్రిల్ 21న ఆదేశించింది.
సుప్రీంకోర్టుకు బోర్డు: హైకోర్టు రెండు తీర్పులనూ సవాల్ చేస్తూ గురుకుల బోర్డు ఈ ఏడాది జులై 26న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
సుప్రీంలో బోర్డు వాదనలు – కోర్టు వ్యతిరేకత : బోర్డు తరఫున సీనియర్ న్యాయవాది గౌరవ్ అగర్వాల్ వాదనలు వినిపిస్తూ, “పరీక్షలో అర్హత సాధించని వారే ఫలితాలు వచ్చాక కోర్టుకు వెళ్లారు. 88 ఖాళీలకు 5,000 మంది పరీక్ష రాశారు, ఫలితాలు కూడా ఇచ్చేశాం. ఇప్పుడు మళ్లీ పరీక్ష పెడితే అర్హత సాధించిన వారికి అన్యాయం జరుగుతుంది. కోర్టుకు వెళ్లింది కేవలం 9 మంది అభ్యర్థులే కాబట్టి, వారికి మాత్రమే రెండు భాషల్లో పరీక్ష నిర్వహించేందుకు అనుమతించండి,” అని కోరారు.
ఈ వాదనలతో జస్టిస్ జె.కె. మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయ్‌లతో కూడిన ధర్మాసనం తీవ్రంగా విభేదించింది. “మీరు నియామక ప్రకటనలోని అంశాలనే ఉల్లంఘించారు. అలాంటప్పుడు మీ వాదనలు చెల్లుబాటు కావు,” అని స్పష్టం చేస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది. అంతేకాకుండా, “మళ్లీ పరీక్ష నిర్వహించేందుకు అయ్యే ఖర్చులన్నీ ఈ తప్పు చేసిన అధికారి జీతం నుంచి రాబట్టాల్సి ఉంటుంది,” అని న్యాయమూర్తి ఘాటుగా వ్యాఖ్యానించారు.


