Telangana Cuba Cooperation : తెలంగాణ-క్యూబా మధ్య ద్వైపాక్షిక సహకారం పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఐటీ, ఫార్మా, బయోటెక్నాలజీ, హెల్త్ కేర్, AI, ఇన్నోవేషన్, వ్యవసాయం, సస్టైనబుల్ ఫార్మింగ్, క్రీడలు, సంస్కృతి వంటి రంగాల్లో నైపుణ్యాలు పంచుకుని ఉమ్మడి పురోగతి సాధించాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు.
డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో క్యూబా రాయబారి జువాన్ కార్లోస్ మార్సన్ అగులేరా, ఫస్ట్ సెక్రటరీ మిక్కీ డియాజ్ పెరెజ్‌తో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు భేటీ అయ్యారు. ఈ భేటీ నేపథ్యంలో కీలక విషయాలు చర్చించారు. “తెలంగాణ ఉన్నత ఆవిష్కరణలు, ఇన్నోవేషన్ విధానాలతో ముందడుగు వేస్తోంది. క్యూబా టెక్నాలజీ, బయోటెక్, హెల్త్‌కేర్‌లో ప్రపంచంలో ముందంజలో ఉంది. అందుకే ద్వైపాక్షిక భాగస్వామ్యంతో ఈ రంగాల్లో పరస్పర సహకారం పెంచుకుందాం. తెలంగాణ స్టార్టప్‌లకు మార్గనిర్దేశం చేస్తూ, క్యూబా స్టార్టప్‌లకు T-Hub, T-Works, V-Hub ద్వారా సపోర్ట్ ఇస్తాము” అని తెలిపారు.
అంతేకాకుండా AI ఆధారిత డయాగ్నోస్టిక్స్, ఫార్మా రీసెర్చ్, పబ్లిక్ హెల్త్ డేటా వంటి అంశాల్లో సహకారం అందిస్తామని హామీ క్యూబా ప్రతినిధులకు హామీ ఇచ్చారు. ప్రపంచంలో టాప్-7 లైఫ్ సైన్సెస్ క్లస్టర్లలో ఒకటైన ‘జీనోమ్ వ్యాలీ’ని సందర్శించాలని వారిని కోరారు. బాక్సింగ్, అథ్లెటిక్స్‌లో క్యూబా నైపుణ్యాన్ని తెలంగాణకు అందించాలని, సాంస్కృతిక, వ్యవసాయ సహకారం, సస్టైనబుల్ ఫార్మింగ్‌లో కూడా భాగస్వామ్యం పెంచుకుందామని కోరారు.
క్యూబా రాయబారి జువాన్ కార్లోస్ మార్సన్ అగులేరా మాట్లాడుతూ, “తెలంగాణ ఇన్నోవేషన్, ఐటీ, బయోటెక్‌లో ముందుంది. ఈ రంగాల్లో సహకారం పెంచుకుందాం. క్యూబా స్టార్టప్‌లకు మార్గదర్శకత్వం అందించండి. జీనోమ్ వ్యాలీ సందర్శనకు మేము సిద్ధం” అని తెలిపారు. సెక్రటరీ మిక్కీ డియాజ్ పెరెజ్ మాట్లాడుతూ “ఇది ఉమ్మడి పురోగతికి తొలి అడుగు” అని వర్ణించారు. ఇక ఈ సమావేశంలో తెలంగాణ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ప్రమోషన్ సెల్ డైరెక్టర్ మధుసూదన్, తెలంగాణ లైఫ్ సైన్సెస్ ఫౌండేషన్ డైరెక్టర్ శక్తి నాగప్పన్ పాల్గొన్నారు.


