Saturday, November 15, 2025
HomeతెలంగాణTelangana Cyber Bureau: సైబర్‌ నేరగాళ్ల ఆట కట్టించిన తెలంగాణ పోలీసులు.. 5 రాష్ట్రాల్లో ఏకకాలంలో...

Telangana Cyber Bureau: సైబర్‌ నేరగాళ్ల ఆట కట్టించిన తెలంగాణ పోలీసులు.. 5 రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు.. 81 మంది అరెస్ట్..!

Telangana Cyber Bureau big operation: తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో దేశవ్యాప్తంగా ఓ భారీ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. ఐదు రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించి, రూ.95 కోట్ల మేర మోసాలకు పాల్పడిన 81 మంది సైబర్ నేరగాళ్లను భారీ ఆపరేషన్‌తో అరెస్టు చేసింది. వీరిపై గతంలోనే దేశవ్యాప్తంగా 754 కేసులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. తెలంగాణ పోలీసుల కథనం ప్రకారం, సైబర్ నేరగాళ్ల కదలికలపై నిఘా పెట్టిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో.. ఆంధ్రప్రదేశ్, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు చేపట్టింది. ఈ ఆపరేషన్‌లో మొత్తం 81 మందిని అదుపులోకి తీసుకుంది. అరెస్టైన వారిలో 17 మంది ఏజెంట్లు, ఏడుగురు మహిళలు, 58 మంది మ్యూల్ అకౌంట్‌ హోల్డర్లు ఉన్నారు. నిందితుల నుంచి 84 సెల్‌ఫోన్లు, 101 సిమ్‌ కార్డులు, 89 బ్యాంకు పాస్‌బుక్‌లు, చెక్‌బుక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా సభ్యుల బ్యాంకు ఖాతాల్లో ఉన్న కోట్లాది రూపాయల నగదును సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు ఫ్రీజ్ చేశారు. చట్టపరమైన ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత ఈ మొత్తాన్ని బాధితులకు తిరిగి అందజేయనున్నట్లు వారు వెల్లడించారు. ఈ అరెస్టులతో దేశంలోని అనేక సైబర్ నేరాలకు అడ్డుకట్ట పడినట్లయిందని అధికారులు తెలిపారు.

- Advertisement -

నిందితుల్లో బ్యాంకు ఉద్యోగులు, ఐటీ సిబ్బంది..

కాగా, నిందితుల్లో పలు రంగాల వారు ఉన్నారని వారిలో బ్యాంక్‌ ఉద్యోగులు, ఐటీ సిబ్బంది, ప్రైవేట్‌ ఉద్యోగులు, బ్రోకర్లు, విద్యార్థులు, రోజువారీ కూలీలు కూడా ఉన్నారనని పోలీసులు తెలిపారు. ముగ్గురు బ్యాంక్‌ ఉద్యోగులు 106 కేసులకు సంబంధించి ఈ నేరాలలో నేరుగా పాల్గొన్నట్లు విచారణలో తేలింది. ఇప్పటివరకు ఈ ఆపరేషన్‌లో 7 సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్లలో 41 కేసులు నమోదయ్యాయి. కొందరు నిందితులకు విదేశీ సంబంధాలు ఉన్నట్లు గుర్తించగా, వారిపై లుక్‌ అవుట్‌ సర్క్యులర్లు (LOCs) జారీ చేయడానికి చర్యలు ప్రారంభినట్లు అధికారులు తెలిపారు. నిందితులపై దేశవ్యాప్తంగా 754 కేసులు ఉన్నట్లు గుర్తించారు. టీజీసీఎస్బీ అధికారులు దేశవ్యాప్తంగా సైబర్‌ మోసాలను ఛేదించడంలో ఇది మరో మైలురాయిగా నిలిచిందని శిఖ గోయల్ పేర్కొన్నారు. కాగా, సోషల్ మీడియాలో పెట్టుబడుల పేరుతో, ఫోన్ కాల్స్, ఫేక్ యాప్‌లు, మెసేజ్ లింక్‌ల ద్వారా ప్రజల బ్యాంక్ వివరాలను సేకరించి వీరు డబ్బులు దోచుకుంటున్నట్లు విచారణలో తేలింది. రోజు రోజుకు సైబర్ నేరాలు ఎక్కువవడంతో సైబర్ క్రైమ్ పోలీసులు వాటిపై ఫోకస్ పెట్టారు. ఒక్క హైదరాబాద్ నగరంలోనే అక్టోబర్‌ నెలలో సైబర్‌ నేరాలకు సంబంధించి భారీగా కేసులు నమోదు అయ్యాయి. వీటిని ఛాలెంజ్‌గా తీసుకున్న హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు.. వివిధ రాష్ట్రాల్లో గాలించి మరీ సైబర్ కేటుగాళ్లను అరెస్ట్ చేశారు. సాంకేతిక పరిజ్ఞానంతో వారిని అడ్డుకునేందుకు పోలీసు శాఖ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. చాకచక్యంగా 5 రాష్ట్రాల్లో మెగా ఆపరేషన్‌ చేపట్టిన హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ప్రశంసిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad