అదానీ, అంబానీ వంటి కొద్దిమంది క్యాపిటలిస్ట్ ల నుంచి జార్ఖండ్ కు విముక్తి కల్పించాలన్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఆదివారం ఆయన ఇండియా కూటమి తరపున జార్ఖండ్ ఎన్నికల (Jharkhand Elections) స్టార్ క్యాంపెయినర్ గా ప్రచారంలో పాల్గొన్నారు. రాంఘర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ మీటింగ్ లో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలకు ఆయన దిశా నిర్దేశం చేశారు. అనంతరం చిత్తార్పూర్ సీ,డీ బ్లాక్ రాజరప్ప బహిరంగ సభలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… జార్ఖండ్ ప్రజల పోరాట స్ఫూర్తిని కొనియాడారు.
మల్లిఖార్జున ఖర్గే నాయకత్వం లో రాహుల్ గాంధీ కాశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా చేసిన జోడో యాత్రతో దేశంలో ప్రజాస్వామిక శక్తులను ఏకం చేశారని భట్టి అన్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ రెండు సందేశాలు ఈ దేశానికి ఇచ్చారని వివరించారు. విద్వేషాలను రగిలించే వారి చేతిలో ఈ దేశాన్ని పెట్టేందుకు మేము సిద్ధంగా లేము, విశాల భారతదేశంలో ప్రేమ అనే దుకాణం తెరిచి అన్ని జాతులు, మతాలకు సమాన అవకాశాలు ఇస్తామని సందేశం ఇచ్చారని వివరించారు. అదే సందర్భంలో ఈ దేశంలోని వనరులు, సంపద, ప్రభుత్వ రంగ సంస్థలు ఈ దేశ ప్రజలకే చెందాలి తప్ప కొద్ది మంది క్రోనీ క్యాపిటలిస్ట్ ల చేతిలో పెట్టేందుకు సిద్ధంగా లేమని సందేశం ఇచ్చారని భట్టి తెలిపారు.
Also Read : ముగిసిన జస్టిస్ చంద్రచూడ్ పదవీకాలం.. రేపే 51వ సీజేఐ ప్రమాణం
అదాని, అంబానీ వంటి క్రోనీ క్యాపిటలిస్ట్ ల నుంచి ఈ దేశాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ పెద్ద పోరాటం చేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. జార్ఖండ్ ఎన్నికల్లో (Jharkhand Elections) ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపిస్తేనే రాష్ట్రంలోని వనరులు రక్షించబడతాయని అన్నారు. ఈ దేశ సంపద జనాభా నిష్పత్తికి అనుగుణంగా పంపిణీ జరగాలి అంటే రాజ్యాంగాన్ని రక్షించుకొని ముందుకు పోవాలి, అందుకు ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించడమే మన ముందు ఉన్న లక్ష్యం అని ఓటర్లకు సూచించారు. రాంఘర్ అభ్యర్థి మమతా దేవిని భారీ మెజార్టీతో గెలిపించాలని, అలాగే కూటమి అభ్యర్థులను అందరినీ గెలిపించాలని భట్టి విక్రమార్క జార్ఖండ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.