Destination weddings in Telangana : డెస్టినేషన్ వెడ్డింగ్.. ఈ మాట వినగానే మనకు గుర్తొచ్చేవి రాజస్థాన్ కోటలు, గోవా బీచ్‌లు, కేరళ బ్యాక్‌వాటర్స్. కానీ, ఇకపై ఈ జాబితాలోకి మన తెలంగాణ కూడా సగర్వంగా చేరనుంది. రాష్ట్రంలోని అద్భుతమైన పర్యాటక ప్రాంతాలను, ప్రపంచస్థాయి వివాహ వేదికలుగా మార్చేందుకు తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ఓ బృహత్తర ప్రణాళికతో ముందుకొచ్చింది. ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో ఏకంగా 30 భారీ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది. అసలు ఏయే ప్రాంతాల్లో ఈ కొత్త ప్రాజెక్టులు రానున్నాయి? వీటివల్ల రాష్ట్రానికి కలిగే ప్రయోజనాలేంటి..?
ఎందుకీ కొత్త ప్రణాళిక : రాజస్థాన్, గోవా, కేరళ వంటి రాష్ట్రాలు డెస్టినేషన్ వెడ్డింగ్‌లతో పర్యాటక రంగంలో దూసుకుపోతున్నాయి. మన రాష్ట్రంలోనూ వాటికి ఏమాత్రం తీసిపోని అందమైన ప్రదేశాలు ఉన్నప్పటికీ, సరైన ప్రచారం, సౌకర్యాలు లేక వెనుకబడిపోయాం. ఈ లోటును భర్తీ చేసి, తెలంగాణను కూడా ఓ ప్రముఖ ‘వెడ్డింగ్ డెస్టినేషన్’గా మార్చాలన్నదే ప్రభుత్వ లక్ష్యం.
ప్రైవేటు భాగస్వామ్యంతో.. రూ.15 వేల కోట్ల పెట్టుబడులు : ఈ లక్ష్య సాధన కోసం, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఇటీవల 30 ప్రాజెక్టుల కోసం ప్రైవేటు సంస్థలతో అవగాహన ఒప్పందాలు (MoU) కుదుర్చుకుంది.
14 ప్రాజెక్టులు పీపీపీ పద్ధతిలో: ఇందులో 14 ప్రాజెక్టులను ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో (PPP) అభివృద్ధి చేయనున్నారు.
రూ.15,279 కోట్ల పెట్టుబడులు: ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయితే, రాష్ట్రంలోకి సుమారు రూ.15,279 కోట్ల పెట్టుబడులు రానున్నాయి.
50,000 మందికి ఉపాధి: ప్రత్యక్షంగా 19,520 మందికి, పరోక్షంగా మరో 30,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా.
రాబోతున్న కొన్ని కీలక ప్రాజెక్టులు : అనంతగిరిలో వెడ్డింగ్ డెస్టినేషన్స్: వికారాబాద్ అనంతగిరి అడవుల ప్రకృతి ఒడిలో, జేడబ్ల్యూ మారియట్ వంటి దిగ్గజ సంస్థల భాగస్వామ్యంతో అత్యాధునిక వెడ్డింగ్ డెస్టినేషన్లు, వెల్‌నెస్ రిట్రీట్‌లు రానున్నాయి.
అమ్రాబాద్‌లో లగ్జరీ రిసార్ట్: అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో ‘తాజ్ సఫారీ’ బ్రాండ్‌తో ఎకో-లగ్జరీ రిసార్ట్ ఏర్పాటు కానుంది.
నాగార్జునసాగర్‌లో వెల్‌నెస్ కేంద్రాలు: బుద్ధవనంలో అంతర్జాతీయ స్థాయి వెల్‌నెస్, ధ్యాన కేంద్రాలు రానున్నాయి.
హైదరాబాద్‌లో ఫైవ్‌స్టార్ హోటళ్లు: తారామతి బారాదరి, రాయదుర్గం, పుప్పాలగూడ, శంషాబాద్, బుద్వేల్ వంటి ప్రాంతాల్లో ఫైవ్‌స్టార్ లగ్జరీ హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్లు ఏర్పాటు కానున్నాయి.
ఈ ప్రాజెక్టులతో తెలంగాణ పర్యాటక రంగం ముఖచిత్రమే మారిపోనుంది. ఇకపై, పెళ్లిళ్లు, ఇతర వేడుకల కోసం మనవాళ్లు పొరుగు రాష్ట్రాలకు, విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, మన రాష్ట్రంలోనే ప్రపంచస్థాయి సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.


