ములుగు జిల్లా ఏటూరునాగారం ఎన్‌కౌంటర్ (Eturnagaram Encounter) పై తెలంగాణ డీజీపీ జితేందర్ (TG DGP Jitender) స్పందించారు. ఎవరిపైనా తాము విషపదార్థాలు వినియోగించలేదని చెప్పారు. పౌర హక్కుల నేతలు చేస్తున్న ఆరోపణలు అవాస్తవం అన్నారు. కొద్దిరోజుల ముందు ఇన్‌ఫార్మర్ల నెపంతో ఆదివాసీలను మావోయిస్టులు చంపారని డీజీపీ గుర్తు చేశారు. మావోయిస్టుల చర్యలను అడ్డుకునేందుకు కూంబింగ్ ఆపరేషన్ చేస్తున్నామని ఆయన వెల్లడించారు. మావోయిస్టులు అత్యాధునిక ఆయుధాలతో పోలీసులపై కాల్పులు జరిపారన్న డీజీపీ… ప్రాణరక్షణ కోసం ఎదురుకాల్పులు జరపాల్సి వచ్చిందని చెప్పారు.
కాగా, ఆదివారం ఉదయం ఏటూరు నాగారం ఏజెన్సీ అడవుల్లో మావోయిస్టులు, పోలీసు బలగాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు కన్నుమూశారు. అయితే ఇది బూటకపు ఎన్కౌంటర్ తెలంగాణ పౌర హక్కుల నేతలు ఆరోపించారు. భోజనంలో మత్తు పదార్థాలు కలిపి మావోయిస్టులను కస్టడీలోకి తీసుకున్న తర్వాత చిత్రహింసలకు గురిచేసే కాల్చి చంపారని పేర్కొంటున్నారు. మావోయిస్టుల మృతదేహాలపై తీవ్ర గాయాలున్నాయని, మృతదేహాలను కనీసం కుటుంబ సభ్యులకు చూపించకుండా పోస్టుమార్టం కోసం తరలించారని తెలిపారు. ఎన్‌హెచ్‌ఆర్‌సీ నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు వ్యవహరించారని పౌర హక్కుల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో డీజీపీ స్పందించారు.