Saturday, November 15, 2025
HomeతెలంగాణDJ sound ban: పండగల పేరుతో డీజేల దరువు... ఆరోగ్యానికి గొడ్డలిపెట్టు!

DJ sound ban: పండగల పేరుతో డీజేల దరువు… ఆరోగ్యానికి గొడ్డలిపెట్టు!

DJ sound ban in Telangana: పండుగ వచ్చిందంటే చాలు… వీధులన్నీ భక్తితో పాటు భారీ శబ్దాలతో హోరెత్తిపోతున్నాయి. ముఖ్యంగా వినాయక చవితి ఉత్సవాల్లో డీజేల దరువులు, లౌడ్ స్పీకర్ల మోతలు చెవులకు చిల్లులు పెడుతున్నాయి. కానీ, ఈ ఉత్సాహం వెనుక మన ఆరోగ్యానికి ఎంత పెను ముప్పు పొంచి ఉందో తెలుసా..? డీజేలపై రాష్ట్రవ్యాప్తంగా నిషేధం ఉన్నా అవి ఎందుకు యథేచ్ఛగా మోగుతున్నాయి..? చెవులు బద్దలయ్యే ఈ శబ్దాల వల్ల కలిగే అనర్థాలేమిటి..? చట్టం ఏం చెబుతోంది..? 

- Advertisement -

నిషేధం ఉన్నా… మోత మోగుతూనే ఉంది: వినాయక చవితి ఉత్సవాల్లో డీజేలను వినియోగించడంపై పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా నిషేధం విధించారు. అయినా సరే, అనేక చోట్ల, ముఖ్యంగా మారుమూల గ్రామాల్లో ఈ నిబంధనలను బేఖాతరు చేస్తున్నారు. కొన్నిచోట్ల డీజేలకు బదులుగా అంతే స్థాయిలో శబ్దం చేసే భారీ లౌడ్ స్పీకర్లను, డప్పులు, డ్రమ్ములను ఉపయోగిస్తూ శబ్ద కాలుష్యానికి కారణమవుతున్నారు. మనిషి సాధారణ వినికిడి సామర్థ్యం 55 డెసిబుల్స్ మాత్రమే. కానీ పండుగల సమయంలో ఈ పరిమితి ఎన్నో రెట్లు దాటిపోతోంది.

శబ్ద జనకం — శబ్ద స్థాయి (డెసిబుల్స్‌లో)
డ్రమ్   — 100 – 130
డీజే   — 100 – 150
టపాసులు   — 100 – 180

శబ్ద కాలుష్యం… అనారోగ్యాలమయం : పరిమితికి మించిన శబ్దాల వల్ల మన శరీరంపై తీవ్ర దుష్ప్రభావాలు పడతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా ఎదురయ్యే సమస్యలు.

ALSO READ: https://teluguprabha.net/telangana-news/what-is-kalvakuntla-kavitha-plan/

వినికిడి లోపం: శాశ్వతంగా వినికిడి శక్తిని కోల్పోయే ప్రమాదం ఉంది.

మానసిక సమస్యలు: చెవుల్లో నిరంతరం మోత, తలనొప్పి, రక్తపోటు పెరగడం, నిద్రలేమి వంటివి సంభవిస్తాయి.

ప్రమాదకరమైన ప్రభావాలు: వృద్ధులు, పసిపిల్లలు, రోగులకు ఈ శబ్దాలు అత్యంత ప్రమాదకరం. గర్భిణుల్లో గుండె వేగం పెరిగి, తీవ్రమైన ఒత్తిడికి గురవుతారు.

చట్టం చెబుతోంది ఇదే : శబ్ద కాలుష్యాన్ని నియంత్రించడానికి చట్టంలో స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్ల వినియోగంపై పూర్తి నిషేధం ఉంది. ఆసుపత్రులు, విద్యాసంస్థలు, కోర్టుల వంటి నిశ్శబ్ద ప్రాంతాల్లో (Silent Zones) అధిక శబ్దాలపై నిషేధం వర్తిస్తుంది. నిబంధనలు ఉల్లంఘించి అధిక డెసిబుల్ శబ్దాలు చేస్తే కేసులు నమోదు చేసి, జరిమానాలు విధించే అధికారం పోలీసులకు ఉంది.

నిపుణులు, పోలీసుల హెచ్చరిక: భారీ శబ్దాల వల్ల కలిగే నష్టంపై వైద్యులు, పోలీసులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. “భారీ శబ్దాల వల్ల వినికిడి లోపం వచ్చే ప్రమాదం ఉంది. చెవుల్లో ఎలాంటి సమస్య తలెత్తినా ‘గోల్డెన్ అవర్’ అయిన 72 గంటల్లోపు ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించాలి. లేదంటే వినికిడి శక్తిని పూర్తిగా కోల్పోవచ్చు.”
– డాక్టర్‌ రాకేష్, ఈఎన్టీ వైద్యుడు, మిర్యాలగూడ.

“వినాయక ఉత్సవాలతో పాటు ఏ పండుగలోనైనా డీజేలకు అనుమతి లేదు. ప్రజలను ఇబ్బంది పెట్టేలా భారీ లౌడ్ స్పీకర్లు, టపాసులు కాల్చడం చట్టవిరుద్ధం. పరిమితికి మించి శబ్దాలు చేస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటాం.”
– రాజశేఖర్‌రాజు, డీఎస్పీ, మిర్యాలగూడ.

నిర్వాహకులకు సూచనలు: ఉత్సవ నిర్వాహకులు కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా పండుగను ప్రశాంతంగా, ఆరోగ్యకరంగా జరుపుకోవచ్చు. భారీ మోతలకు బదులుగా సంప్రదాయ వాయిద్యాలను ప్రోత్సహించాలి. శోభాయాత్రల్లో భజనలు, కోలాటాలు వంటి కళారూపాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. డీజేలు, భారీ టపాసులను పూర్తిగా విడిచిపెట్టి, పర్యావరణహితంగా ఉత్సవాలు నిర్వహించాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad