Almont Kid syrup: దగ్గు సిరప్‌లు ప్రాణాంతకంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. అల్మాంట్–కిడ్ సిరప్ (Almont-Kid Syrup)ను వాడవద్దని హెచ్చరించింది. అది దగ్గు మందు కాదని, దగ్గుమందు రూపంలో ఉన్న స్లో పాయిజన్ అని పేర్కొంది.
అత్యవసర హెచ్చరిక: అల్మాంట్–కిడ్ సిరప్‌లో ఎథిలీన్ గ్లైకాల్ కలిసినట్లు ల్యాబ్ పరీక్షల్లో తేలినట్లుగా పేర్కొంది. దీంతో ఈ దగ్గుమందు వినియోగాన్నివెంటనే నిలిపివేయాల్సిందిగా తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజలకు అత్యవసర హెచ్చరిక జారీ చేసింది. ఈ విషయాన్ని కేంద్ర ఔషధ ప్రమాద నియంత్రణ సంస్థ (CDSCO) ఈస్ట్ జోన్, కోల్ కతా నుంచి వచ్చిన అలర్ట్ ఆధారంగా రాష్ట్ర డ్రగ్స్ కంట్రోల్ శాఖ పేర్కొంది. బిహార్‌కు చెందిన ట్రిడస్ రెమిడీస్ అనే ఫార్మా సంస్థ తయారు చేసిన AL-24002 బ్యాచ్ సిరప్ శాంపిల్స్‌ను పరిశీలించగా.. అత్యంత విషపూరితమైన ఎథిలీన్ గ్లైకాల్ ఉన్నట్లుగా గుర్తించినట్లుగా అధికారులు తెలిపారు. ఇది శరీరంలోని కిడ్నీలు, నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదకరమైన కెమికల్‌లని పేర్కొన్నారు. అది పిల్లలకు ప్రాణాపాయం కలిగే అవకాశం ఉందని హెచ్చరించారు.
డ్రగ్స్ కంట్రోల్ అధికారుల విజ్ఞప్తి: అల్మాంట్- కిడ్ సిరప్‌ను ఎవరైనా కొనుగోలు చేసి ఉంటే దానిని వెంటనే వాడటం ఆపాలని డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ సూచించింది. దీనిపై ఏమైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే నేరుగా రాష్ట్ర డ్రగ్స్ కంట్రోల్ శాఖకు తెలియజేయాలని పేర్కొంది. అందుకోసం టోల్ ఫ్రీ నంబర్ 1800-599-6969 నంబరును అందుబాటులో ఉంచుతున్నామని తెలిపింది. పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని.. దగ్గు మందుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అంతేకాకుండా అనుమానాస్పద సిరప్ కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని డ్రగ్స్ కంట్రోల్ అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

