Drunken driving new rules Telangana : “కొంచెమే తాగాను.. పోలీసులకు దొరకనులే” అనే ధీమాకు కాలం చెల్లింది. కిక్కులో జాలీ రైడ్లకు వెళ్లేవారి జేబుకు చిల్లు పడటమే కాదు, ప్రభుత్వ ఉద్యోగులైతే ఏకంగా ఉద్యోగంపై వేటు పడే ప్రమాదం పొంచి ఉంది. మోటారు వాహన సవరణ చట్టాన్ని కఠినంగా అమలు చేస్తున్నట్లు పోలీసులు హెచ్చరిస్తున్నారు.
భారీగా పెరిగిన జరిమానాలు : మోటారు వాహన సవరణ చట్టం 2019 ప్రకారం, డ్రంకెన్ డ్రైవ్‌పై విధించే శిక్షలు, జరిమానాలను భారీగా పెంచారు. నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో సోమవారం నుంచి ఈ నిబంధనలను పకడ్బందీగా అమలు చేయనున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు.
పాత నిబంధనలు: గతంలో సెక్షన్ 185 ప్రకారం రూ.1,000 నుంచి రూ.3,000 వరకు జరిమానా లేదా 6 నెలల వరకు జైలు శిక్ష ఉండేది.
కొత్త నిబంధనలు:
తొలిసారి పట్టుబడితే: రూ.10,000 జరిమానా మరియు/లేదా 6 నెలల వరకు జైలు శిక్ష.
మూడేళ్లలో రెండోసారి పట్టుబడితే: రూ.15,000 జరిమానా మరియు/లేదా 6 నెలల వరకు జైలు శిక్ష.
ప్రభుత్వ ఉద్యోగులూ పారాహుషార్ : కొత్త నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు మరింత అప్రమత్తంగా ఉండాలి.
సస్పెన్షన్ వేటు: ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి మద్యం సేవించి వాహనం నడిపిన కేసులో మూడు రోజులు లేదా అంతకంటే ఎక్కువ రోజులు జైలు శిక్ష అనుభవిస్తే, వారిపై శాఖాపరమైన సస్పెన్షన్ వేటు పడుతుంది. ఈ నిబంధన ఉద్యోగుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
“మద్యం తాగి ప్రమాదాలకు కారణమైతే ఎదుటి వారి కుటుంబాలు రోడ్డున పడతాయి. ఈ రోజు నుంచి సవరణ చట్టాన్ని కఠినంగా అమలు చేస్తాం. పట్టుబడే వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు,” అని నిజామాబాద్ ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ తీవ్రంగా హెచ్చరించారు. జైలుకు వెళ్లి వచ్చినా కొందరిలో మార్పు రాకపోవడంతోనే ఈ కఠిన నిర్ణయాలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.


