Saturday, November 15, 2025
Homeతెలంగాణcollege fee : నాణ్యమైన కాలేజీలకే ఫీజుల వరం - అడ్డగోలు పెంపునకు సర్కార్ కళ్లెం!

college fee : నాణ్యమైన కాలేజీలకే ఫీజుల వరం – అడ్డగోలు పెంపునకు సర్కార్ కళ్లెం!

Telangana Engineering Fee Regulation :  ఇంజినీరింగ్ విద్యలో ఇకపై నాణ్యతే కొలమానం! అడ్డగోలుగా ఫీజులు పెంచుకునే ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలకు రాష్ట్ర ప్రభుత్వం కళ్లెం వేసింది. కేవలం లెక్కలు చూపి ఫీజులు పెంచుకునే రోజులకు చెల్లుచీటీ పలుకుతూ, విద్యా ప్రమాణాలు, విద్యార్థులకు కల్పించే సౌకర్యాల ఆధారంగానే ఫీజుల పెంపునకు అనుమతి ఇవ్వాలని సంచలన నిర్ణయం తీసుకుంది. 

- Advertisement -

ఇంజినీరింగ్, ఇతర ప్రొఫెషనల్ కాలేజీలలో ఫీజుల విషయంలో నెలకొన్న అనిశ్చితికి ముగింపు పలుకుతూ, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమైన ఉత్తర్వులను జారీ చేసింది. ఫీజుల పెంపును కేవలం కళాశాలల ఆర్థిక లావాదేవీలకే పరిమితం చేయకుండా, సమగ్రమైన విద్యా ప్రమాణాలతో ముడిపెట్టింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్షల అనంతరం ఈ నిర్ణయం వెలువడింది.

ఫీజుల పెంపునకు కొత్త కొలమానాలు  : ప్రభుత్వం జారీ చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం, ఫీజుల పెంపును ప్రతిపాదించే కళాశాలలు ఈ క్రింది ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలి.

విద్యా ప్రమాణాలు: జాతీయ (NAAC, NBA), అంతర్జాతీయ ర్యాంకింగ్‌లలో కళాశాల స్థానం.

సాంకేతికత వినియోగం: విద్యార్థుల హాజరు కోసం ఫేషియల్ రికగ్నిషన్ అమలు, ఆధార్ ఆధారిత ఫీజుల చెల్లింపుల విధానం.

ఉద్యోగ అవకాశాలు (ప్లేస్‌మెంట్స్): ఆయా కళాశాలల్లో చదివిన విద్యార్థులకు ఎంత శాతం ఉద్యోగాలు లభిస్తున్నాయి అనే దానిపై ప్రత్యేక దృష్టి.

పరిశోధనలకు ప్రోత్సాహం: విద్యార్థులను పరిశోధనల వైపు ఏ మేరకు ప్రోత్సహిస్తున్నారు, వారికి కల్పిస్తున్న సౌకర్యాలు ఏమిటి అనే అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు.

ఈ నిర్ణయం వెనుక జరిగింది ఇదే  : ఈ ఏడాది (2025-26) కూడా పాత ఫీజులనే కొనసాగించాలని ప్రభుత్వం జూన్ 30న జీవో 26 జారీ చేసింది. దీనిని సవాలు చేస్తూ గురునానక్, గోకరాజు రంగరాజు సహా 11 ప్రముఖ కళాశాలలు హైకోర్టును ఆశ్రయించాయి. విచారణ చేపట్టిన న్యాయస్థానం, ఫీజుల నిర్ధారణపై ఆరు వారాల్లోగా నిర్ణయం తీసుకుని నివేదిక ఇవ్వాలని తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ (TAFRC)ని ఆదేశించింది. ఆ గడువు ఆగస్టు 22తో ముగుస్తుండటంతో ప్రభుత్వం ఈ అంశంపై ముమ్మర కసరత్తు చేసింది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసంలో ఆగస్టు 19న అర్ధరాత్రి వరకు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య వి.బాలకిష్టారెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేనతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఈ చర్చల ఫలితంగానే ఫీజుల పెంపును నాణ్యతా ప్రమాణాలతో ముడిపెడుతూ ప్రభుత్వం తాజా నిబంధనలను ప్రకటించింది.

ఈ నిర్ణయంతో నాణ్యమైన విద్యను అందిస్తూ, విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఇస్తున్న కళాశాలలకు మాత్రమే ఫీజులు పెంచుకునే అవకాశం లభిస్తుంది. కేవలం డబ్బు సంపాదనే లక్ష్యంగా నడిచే కళాశాలలకు ఇది గట్టి హెచ్చరిక అని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad