Monkey control measures for agriculture : పొలాల్లో పంటను బతకనివ్వవు.. ఇళ్లలోకి చొరబడి వస్తువులను చిందరవందర చేస్తాయి.. అడ్డువస్తే దాడులకూ వెనకాడవు! ఇది తెలంగాణ పల్లెలు, పట్టణాల్లో కోతుల బెడదతో జనం పడుతున్న నిత్య నరకం. పదిహేనేళ్లుగా రైతన్నను ఆర్థికంగా దెబ్బతీస్తూ, సామాన్యులను భయభ్రాంతులకు గురిచేస్తున్న ఈ ‘కిష్కింధకాండ’కు అడ్డుకట్ట వేసేందుకు ఎట్టకేలకు రైతు సంక్షేమ కమిషన్ నడుం బిగించింది. అసలు కోతుల కట్టడికి ప్రభుత్వం ఎలాంటి ప్రణాళికలు రచిస్తోంది? హిమాచల్ ప్రదేశ్ నమూనా అంటే ఏమిటి..? రైతన్నకు శాశ్వత పరిష్కారం లభించేనా..?
తెలంగాణలో వనాలు వీడిన వానరాలు జనారణ్యంలో సృష్టిస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదు. వ్యవసాయ, ఉద్యాన పంటలను నాశనం చేస్తుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గత 15 సంవత్సరాలుగా ఈ సమస్య తీవ్రరూపం దాల్చడంతో, కొన్ని గ్రామాల్లో “కోతులను నిర్మూలించే పార్టీకే మా ఓటు” అంటూ ప్రజలు తీర్మానాలు చేసే స్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో, రైతులు, ప్రజల నుంచి వెల్లువెత్తుతున్న ఫిర్యాదులపై స్పందించిన రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రంగంలోకి దిగింది.
రైతు కమిషన్ ఏం చేస్తోంది : రైతు కమిషన్ ఛైర్మన్ ఎం. కోదండరెడ్డి చొరవతో వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్థక, అటవీ శాఖల ఉన్నతాధికారులు, శాస్త్రవేత్తలు, అంకుర సంస్థల ప్రతినిధులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో కోతుల కట్టడికి పలు మార్గాలను నిపుణులు సూచించారు.
సౌరశక్తి కంచెలు: పంట పొలాల చుట్టూ సౌరశక్తి కంచెలు (సోలార్ ఫెన్సింగ్) ఏర్పాటు చేయడం ద్వారా కోతుల బెడదను గణనీయంగా తగ్గించవచ్చని అంకుర సంస్థల ప్రతినిధులు సూచించారు.
కుటుంబ నియంత్రణ: హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కోతుల సంతతిని నియంత్రించడానికి వాటికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు (స్టెరిలైజేషన్) విజయవంతంగా నిర్వహిస్తోంది. అదే తరహాలో మన రాష్ట్రంలోని నిర్మల్‌లో ప్రయోగాత్మకంగా 2,000 కోతులకు స్టెరిలైజేషన్ చేశారు. ఈ విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
అడవుల్లో ఆహారం: అడవుల్లో ఆహారం, నీటి కొరత వల్లే కోతులు జనావాసాల్లోకి వస్తున్నాయని గుర్తించిన నిపుణులు, అటవీ ప్రాంతాల్లో పండ్ల మొక్కలను విరివిగా నాటాలని, వాటికి ఆహార కేంద్రాలను (ఫుడ్ కోర్టులు) ఏర్పాటు చేయాలని సిఫార్సు చేశారు.
ప్రభుత్వానికి నివేదిక.. బడ్జెట్‌లో నిధులు: హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆకుకూరలు, కూరగాయల సాగు తగ్గిపోవడానికి కోతులే ప్రధాన కారణమని ఛైర్మన్ కోదండరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నిపుణులు సూచించిన పరిష్కార మార్గాలను అమలు చేయడానికి భారీగా నిధులు అవసరమని కమిషన్ గుర్తించింది. సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకునే రైతులకు రాయితీలు ఇవ్వాలని, కోతులకు కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని నిర్ణయించింది. ఈ అంశాలపై సమగ్ర నివేదికను త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమర్పించి, రాబోయే బడ్జెట్‌లో ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరనుంది. వ్యవసాయ, ఉద్యాన, అటవీ, పంచాయతీరాజ్ వంటి అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ ఈ సమస్యపై యుద్ధం ప్రకటించాలని కమిషన్ నిర్ణయించింది.


