Organic farming success stories : ఓ వైపు యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తుంటే, మరోవైపు కొందరు రైతులు “మాకు యూరియా వద్దు, ఆ గోమాతే ముద్దు” అంటున్నారు. రసాయన ఎరువులతో నిస్సారమైన నేలను చూసి, అధిక పెట్టుబడులతో కుంగిపోయి, తిరిగి పాత పద్ధతులకే జై కొడుతున్నారు. ఆవు పేడ, మూత్రంతోనే అద్భుతాలు సృష్టిస్తూ, సేంద్రియ, ప్రకృతి వ్యవసాయంలో లాభాల బాట పడుతున్నారు. అసలు ఈ మార్పునకు కారణమేంటి…? ఈ రైతులు అనుసరిస్తున్న విజయ రహస్యాలేంటి…?
యూరియాతో అనర్థాలు.. ఎందుకీ మార్పు : ఒకప్పుడు ప్రతి ఇంటి పెరట్లో పశువులు, పెంటదిబ్బలు ఉండేవి. ఆ సేంద్రియ ఎరువే భూమికి బలం. కానీ, పశుసంపద తగ్గిపోవడంతో, రైతులు యూరియా వంటి రసాయన ఎరువులపై ఆధారపడటం మొదలుపెట్టారు. మోతాదుకు మించి యూరియా వాడకం వల్ల నేల సారం దెబ్బతినడమే కాకుండా, పంటలపై తెగుళ్ల బెడద పెరిగి, పెట్టుబడి తడిసిమోపెడవుతోంది. ఈ చేదు నిజాన్ని గ్రహించిన కొందరు చైతన్యవంతులైన రైతులు, తిరిగి ప్రకృతి సేద్యం వైపు ‘యూ-టర్న్’ తీసుకుంటున్నారు.
విజయ గాథలు.. వారి మాటల్లోనే…
చెరుకూరి రామారావు, ఖమ్మం జిల్లా: 12 ఏళ్లుగా 25 ఎకరాల్లో పూర్తిగా సేంద్రియ పద్ధతిలోనే బొప్పాయి, చెరకు, పసుపు, కూరగాయలు పండిస్తున్నారు.
ఎరువులు: పశువులు, కోళ్ల ఎరువు, పచ్చిరొట్ట, వేప నూనె, పంట వ్యర్థాలతో తయారు చేసిన జీవామృతం, ఘనజీవామృతం.
ఆదాయం: పండించిన ఉత్పత్తులను విక్రయించేందుకు ఖమ్మంలో సొంతంగా ‘న్యాచురల్ స్టోర్’ ఏర్పాటు చేసుకున్నారు.
అనుముల రాంరెడ్డి, ముత్తగూడెం, ఖమ్మం జిల్లా: 22 ఏళ్లుగా ప్రకృతి సేద్యంలో వరి పండిస్తున్నారు. 50 ఏళ్లుగా గోశాలను నిర్వహిస్తున్నారు.
ఎరువులు: జీవామృతం, ఘనజీవామృతం, అగ్నిఅస్త్రం, నీమాస్త్రం వంటి కషాయాలు.
ఫలితం: మొదట్లో ఎకరానికి 16 బస్తాలు పండితే, ఇప్పుడు ఏకంగా 28-30 బస్తాల దిగుబడి సాధిస్తున్నారు. ఈ సేంద్రియ బియ్యాన్ని సొంతంగా మార్కెటింగ్ చేసుకుంటున్నారు.
డాక్టర్ జనార్దన్, నారాయణపేట్ జిల్లా: 15 ఏళ్లుగా 50 దేశీ ఆవులతో సేంద్రియ విధానంలో మామిడి, వరి, కంది పండిస్తున్నారు.
విధానం: ఆవు పాలు, పెరుగు, నెయ్యి, పేడ, మూత్రం, బెల్లం వంటి వాటితో ‘పంచగవ్య’ తయారు చేసి, పంటలకు పిచికారీ చేస్తున్నారు.
“ఒక్క ఆవు ఉంటే చాలు, 3 ఎకరాలకు సరిపడా ఎరువులు తయారు చేసుకోవచ్చు. నాలుగేళ్లలో యూరియా, డీఏపీ అవసరమే ఉండదు.”
– స్వామి, శాస్త్రవేత్త, కేవీకే, జహీరాబాద్
ప్రకృతి సేద్యం.. భవిష్యత్తుకు భరోసా : రసాయన ఎరువులు తాత్కాలికంగా అధిక దిగుబడిని ఇచ్చినట్లు అనిపించినా, దీర్ఘకాలంలో భూమిని నాశనం చేసి, మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. కానీ, గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం భూమిని సారవంతం చేయడమే కాకుండా, రైతుకు పెట్టుబడి భారాన్ని తగ్గిస్తుంది. వినియోగదారుడికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తుంది.
“ఆవును నమ్ముకొని ప్రకృతి వ్యవసాయం చేస్తే, భావితరాలకు సారవంతమైన నేలలు, నాణ్యమైన పంటలు అందించగలుగుతాం.”
– గంట దామోదర్‌రెడ్డి, కల్వల, మహబూబాబాద్ జిల్లా


