Telangana flood relief measures: రాష్ట్రాన్ని ముంచెత్తిన వరదల వల్ల కలిగిన నష్టంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒకవైపు బాధితులకు తక్షణ భరోసా కల్పిస్తూనే, సహాయక చర్యల్లో అలసత్వం వహించిన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తీవ్రంగా నష్టపోయిన జిల్లాలకు తక్షణమే రూ.10 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన ఆయన, కేంద్రం నుంచి నిధులు రాబట్టేందుకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో ఢిల్లీకి ఉన్నతస్థాయి బృందాన్ని పంపుతున్నట్లు వెల్లడించారు.
కలెక్టర్లతో ఉన్నతస్థాయి సమీక్ష: ఇటీవలి భారీ వర్షాలు, వరదల ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
తక్షణ సాయం: వరదల్లో మరణించిన వారి కుటుంబాలకు తక్షణమే రూ.5 లక్షల చొప్పున పరిహారం అందించాలి.
నిధుల విడుదల: అత్యధికంగా నష్టపోయిన జిల్లాలకు తక్షణ పనుల కోసం రూ.10 కోట్లు, సాధారణ నష్టం వాటిల్లిన జిల్లాలకు రూ.5 కోట్లు కలెక్టర్ల ఆధీనంలో ఉంచుతున్నట్లు ప్రకటించారు.
అధికారులపై ఆగ్రహం: రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి (SDRF) కింద నిధులు అందుబాటులో ఉన్నా, నిబంధనల పేరుతో ఖర్చు చేయడంలో జాప్యం చేయడంపై అధికారుల తీరును తీవ్రంగా తప్పుబట్టారు.
Also read:https://teluguprabha.net/telangana-news/heavy-rain-forecast-in-telugu-states/
ఢిల్లీకి దౌత్యం.. నిధుల కోసం యత్నం: గతేడాది ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో సంభవించిన వరద నష్టానికి కేంద్రం నుంచి ఇంతవరకు పైసా సాయం అందకపోవడంపై సీఎం ఆరా తీశారు. గత హామీలతో పాటు, ప్రస్తుత నష్టంపై కూడా రెండు వేర్వేరు సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. “ఈ రెండు నివేదికలతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలోని బృందం ఈ నెల 4న ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులను కలిసి మన వాటా నిధుల కోసం ఒత్తిడి తెస్తుంది” అని సీఎం స్పష్టం చేశారు.
శాఖలవారీగా ఆదేశాల జాతర..
వ్యవసాయం: రాష్ట్రవ్యాప్తంగా 82 మండలాల్లో 2.36 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అధికారులు తెలపగా, రెండ్రోజుల్లో పూర్తి నివేదిక ఇస్తే కేంద్రానికి పంపుతామని సీఎం తెలిపారు.
నీటిపారుదల: గండిపడిన 257 చెరువులు, కుంటలకు తక్షణ మరమ్మతులు చేపట్టాలని, నీటి వినియోగదారుల సంఘాలను పునరుద్ధరించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సూచించారు.
విద్యుత్: నీట మునిగిన సబ్‌స్టేషన్ల స్థానంలో ఆధునికమైనవి ఏర్పాటు చేయాలని విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్‌ను ఆదేశించారు.
SDRF బలోపేతం: వరదల్లో పనిచేసిన SDRF దళాలను అభినందించిన సీఎం, వారికి మరింత మెరుగైన శిక్షణ ఇవ్వాలని డీజీ నాగిరెడ్డికి సూచించారు. మున్ముందు విపత్తుల తీవ్రత పెరిగే అవకాశం ఉన్నందున, కలెక్టర్లు, ఎస్పీలు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ సహాయక చర్యలను పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి గట్టిగా హెచ్చరించారు.


