Loans: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేనేత రంగ కార్మికులకు మద్దతుగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రంగంలో పని చేసే వారిపై ఉన్న అప్పుల భారం తగ్గించేందుకు రూ.1 లక్ష వరకు వ్యక్తిగతంగా తీసుకున్న రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఈ పథకానికి అవసరమైన రూ.33 కోట్లు ప్రభుత్వం విడుదల చేస్తూ, జూలై 1న అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం వృత్తి పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న అనేక చేనేత కార్మికులకు ఆర్థికంగా ఉపశమనం కలిగించనుంది. వస్త్ర తయారీ, షాపుల నిర్వహణ, పరికరాల కొనుగోలు వంటి అవసరాల కోసం తీసుకున్న రుణాలు ఈ మాఫీ పరిధిలోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టంగా తెలిపింది.
రైతుల తరహాలో చేనేత రుణమాఫీ
తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఇటీవల అమలు చేసిన రుణమాఫీ పథకానికి అనుసంధానంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఇటీవల రైతుల కోసం నాలుగు విడతలుగా సుమారు రూ. 25,000 కోట్ల వరకు రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఇప్పుడు చేనేత వృత్తిదారులకు కూడా అదే తరహాలో మద్దతు ఇవ్వనుంది. ఈ పథకం ద్వారా 2017 ఏప్రిల్ 1 నుండి 2024 మార్చి 31 మధ్య కాలంలో తీసుకున్న రుణాలపై ఉన్న అసలు మొత్తం, వడ్డీ మొత్తం మాఫీ అవుతుంది. ఈ రుణాలు గరిష్ఠంగా ఒక్కో కార్మికుడికి రూ. 1 లక్ష వరకు ఉండవచ్చు.
మాఫీ ఎలా అమలు అవుతుంది?
ఈ పథకాన్ని అమలు చేయడానికి జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ నేతృత్వంలో కమిటీ. రాష్ట్ర స్థాయిలో చేనేత శాఖ సంచాలకుడు నేతృత్వంలో కమిటీ ఉండనుంది. జిల్లా కమిటీ నివేదికలను పరిశీలించిన తర్వాత, రాష్ట్ర కమిటీ ఆమోదించిన లబ్ధిదారులకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి మాఫీ మొత్తం జమ చేస్తారు. అనంతరం, సంబంధిత బ్యాంకులు “నో డ్యూస్” సర్టిఫికెట్ జారీ చేస్తాయి. ప్రస్తుతం చేనేత వృత్తిలో కొనసాగుతున్న వారు ఈ పథకానికి అర్హులు. అలాగే తమ తమ బ్యాంకు ఖాతాలు యాక్టీవ్‌గా ఉన్నవారు దీనికి అర్హులు.
ప్రస్తుతం చేనేత పనులు చేయని వారు, బ్యాంకు ఖాతాలు NPA (నాన్-పర్ఫార్మింగ్ అసెట్)గా లిస్టైనవారు, ఈ పథకం కింద మాఫీ పొందిన వారు, దీనికి అర్హులు కారు. ఒకవేళ మీరు అర్హత కలిగి ఉంటే.. భవిష్యత్తులో కొత్త రుణాల కోసం తిరిగి దరఖాస్తు చేయవచ్చు. ఈ చర్య ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చేనేత రంగాన్ని మరింత బలోపేతం చేయాలన్న లక్ష్యాన్ని ప్రకటించింది. దీని ద్వారా కార్మికుల ఆర్థిక స్థితి మెరుగుపడటంతో పాటు, రంగానికి స్థిరత కూడా లభిస్తుంది.