Telangana Government Cancels GO 49: తెలంగాణలో కొమురం భీం కన్జర్వేషన్ కారిడార్ ఏర్పాటు కోసం జారీ చేసిన జీవో 49ను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఆదివాసీ సంఘాల ఆందోళనల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ జీవోను నిలిపివేయాలని అధికారులను ఆదేశించారు. కొమురం భీం జిల్లాలో అటవీ భూములను కన్జర్వేషన్ కారిడార్‌గా మార్చేందుకు గత నెలలో జీవో 49 జారీ అయింది. జీవో రద్దును స్వాగతించిన మంత్రి సీతక్క సహా ఆదివాసీ నాయకులు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు.
ఏమిటి జీవో 49?
తడోబా టైగర్ రిజర్వ్, కవ్వాల్ టైగర్ రిజర్వ్‌లను కలుపుతూ మధ్యలో ఉన్న ప్రాంతంలో కొమురంభీం కన్జర్వేషన్ కారిడార్ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గత నెల 30న జీవో 49 తీసుకొచ్చింది. ఈ నిర్ణయం ఆదివాసీల జీవనోపాధిని, భూమి హక్కులను ప్రభావితం చేస్తుందనే ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ జీవో వల్ల ఆదివాసీలు తమ సాంప్రదాయ భూములను కోల్పోతారని, వారి జీవన విధానం దెబ్బతింటుందని నిరసనలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో మంత్రి సీతక్క ఆదివాసీలతో కలిసి పోరాటం చేశారు. ఆదివాసీల ఆందోళనలను పరిగణనలోకి తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి జీవో 49ని రద్దు చేశారు.


