Bonalu Holidays: తెలంగాణ రాష్ట్రంలో బోనాల పండుగ శోభాయమానంగా కొనసాగుతోంది. హైదరాబాద్ నగరంలో ఇప్పటికే పలు ఏరియాల్లో బోనాలు పూర్తవగా.. కొన్ని ప్రాంతాలతో పాటు పలు ముఖ్యమైన ఏరియాల్లో బోనాలు జగరాల్సి ఉంది. అమ్మవారికి భక్తులు కోటిదేరు తరలివచ్చి బోనాలు సమర్పిస్తూ తమ భక్తిని ప్రదర్శిస్తున్నారు. రంగురంగుల వేషధారణలో, కోలాటాలతో, డప్పులతో అమ్మవారికి కానుకలు సమర్పిస్తూ ఉత్సాహంగా పాల్గొంటున్నారు. రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు కూడా అమ్మవారి పూజల్లో పాల్గొని బోనాలు సమర్పించారు. ఉత్సవాలు ఊరూరా, నగరంలో చెలరేగిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
రేపు సెలవు
బోనాలు సందర్భంగా రేపు అనగా.. జూలై 21 (సోమవారం)న అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తూ అధికారికంగా ప్రభుత్వం తరఫున ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఇప్పటికే ఆదివారం సెలవుతో కలిపి రెండు రోజుల విరామం లభించడంతో ప్రజలు పండుగను కుటుంబంతో ఆనందంగా గడిపే అవకాశం పొందుతున్నారు. బోనాల పర్వదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలలో సోమవారం నాడు మద్యం అమ్మకాలను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. లిక్కర్ దుకాణాలు బంద్ ఉండనుండటంతో శాంతి భద్రతల దృష్ట్యా ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
ప్రఖ్యాత లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాల వేడుకలు ఆదివారం ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారి దర్శనానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ఆలయ ప్రాంగణంలో భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఆలయం అలంకరణ, భక్తుల పాటలు, డప్పుల మ్రోగుతో పండుగ వాతావరణం తారస్థాయికి చేరుకుంది. బోనాల నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకున్నారు. సున్నిత ప్రాంతాల్లో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF) మోహరించగా, ట్రాఫిక్ నియంత్రణ కోసం పలు మార్గాల్లో రాకపోకలపై ఆంక్షలు విధించారు. ముఖ్య ఆలయాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. దీంతో పాటు ఈ వారం మూడు రోజుల పాటు సెలవులు ఉండనున్నాయి. ఇప్పటికే బోనాల సందర్భంగా రేపు సెలవు ప్రకటించగా.. ఈనెల 23వ తేదీన కొన్ని విద్యా సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో ఆరోజు కూడా సెలవు ఉండనుంది. దీంతో పాటు హైదరాబాద్ నగరంలో కొన్ని పాఠశాలలు అయిదు రోజులు మాత్రమే క్లాసులు నిర్వహిస్తుండడంతో.. మూడు రోజుల సెలవు వర్తించనుంది.


