Thursday, July 17, 2025
HomeతెలంగాణRythu Bharosa: రైతులకు తెలంగాణ సర్కార్ శుభవార్త

Rythu Bharosa: రైతులకు తెలంగాణ సర్కార్ శుభవార్త


Rythu Bharosa: రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. రైతు భరోసా నిధులను మంగళవారం నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. పలువురు మంత్రులతో జరిగిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఈమేరకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా సంక్షేమ పథకాలపై విస్తృతంగా ప్రచారం చేయాలని మంత్రులకు సూచించారు

అలాగే ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల గురించి కూడా చర్చించారు. జిల్లా నేతలతో ఇంఛార్జ్ మంత్రులు సమన్వయం చేసుకోవాలని ఆయన ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్తలను ఎన్నికలకు సిద్ధం చేయాలని సూచించారు. మంత్రులు, జిల్లాల ఇంచార్జ్ లు సమన్వయం చేసుకోవాలని ఆయన సూచించారని తెలుస్తోంది.

ఇక రాష్ట్రంలోని అన్ని వైద్య కళాశాలలు పూర్తి స్థాయి వసతులతో సమర్థవంతంగా పనిచేసేలా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో ఉన్న 34 మెడికల్ కాలేజీల్లో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఇటీవల రాష్ట్రంలోని 26 వైద్య కళాశాలల్లో ఉన్న సౌకర్యాలపై జాతీయ వైద్య మండలి అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో వైద్య కళాశాల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. కళాశాలల్లో క్షేత్రస్థాయిలో పరిస్థితిని అంచనా వేయడానికి అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. ఆయా కళాశాలల్లో అవసరమైన అన్ని వసతులను రాబోయే మూడేళ్లలో సమకూర్చాలని స్పష్టం చేశారు. ఇందుకు ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందని తెలిపారు.

మరోవైపు రైతు నేస్తం కార్యక్రమం ప్రారంభోత్సవంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే రైతు రుణమాఫీ చేశామని తెలిపారు. అలాగే సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇచ్చామన్నారు. ఇప్పటివరకు రూ. 74 వేల కోట్ల రైతుల కోసం ఖర్చు చేశామన్నారు. రైతు భరోసా నిధులను రైతుల ఖాతాలో జమ చేయబోతున్నామని స్పష్టం చేశారు. 9 రోజుల్లోనే రైతులందరికి అకౌంట్లలోకి రైతు భరోసా నగదు జమ చేయబోతున్నట్లు చెప్పారు. ప్రజలకు మంచి జరుగుతుంటే బీఆర్ఎస్ నేతలు ఓర్వలేక అడ్డగోలుగా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News