Telangana Govt: తెలంగాణ ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని పలు మెడికల్ కాలేజీల్లో వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు తీపి కబురును అందించింది. వారికి 15 శాతం స్టైఫండ్ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ మెడికల్ కళాశాలల్లో చదువుతున్న మెడికల్, డెంటల్ విద్యార్థులకు పెంచిన ఈ స్టైఫండ్ వర్తించనుంది. అలాగే సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల గౌరవ వేతనాన్ని కూడా పెంచింది. ఈ మేరకు మరో ఉత్తర్వు జారీ చేసింది. పెంచిన ఈ స్టైఫండ్లతో.. ఇంటర్న్ డాక్టర్లకు నెలకు రూ.29,792ల స్టైఫండ్ లభించనుంది. అలాగే పీజీ చేస్తున్న డాక్టర్లకు మొదటి సంవత్సరంలో రూ.67,032, రెండవ సంవత్సరంలో రూ.70,757, ఇక చివరి సంవత్సరంలో రూ.74,782ల గౌరవ వేతనాన్ని అందించనుంది. ఈ పెంపుతో మెడికల్ విద్యార్థులకు మేలు జరగనుంది. గత కొంత కాలంగా స్టైఫండ్ పెంచాలని డిమాండ్ చేస్తున్న విద్యార్థుల మొరను విన్న ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
అటు తెలంగాణలోని వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో పని చేస్తున్న జూనియర్ డాక్టర్లు సైతం.. గౌరవ వేతనం పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. దీనిపై పలుమార్లు ప్రభుత్వానికి విన్నవించినా ఫలితం లేదని భావించిన జూడాలు సమ్మె బాట పట్టాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో విద్య విద్యార్థులు గౌరవ వేతనాన్ని పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆసక్తికరంగా మారింది. ఈ నిర్ణయంతో జూడాలకు ఏ విధమైన మేలు జరగనుందో తెలియాల్సి ఉంది. అలాగే వారి డిమాండ్లపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి.