CM Revanth reddy on kaleshwaram project: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. బ్యారేజీల్లో అక్రమాలు, వైఫల్యాలపై మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ శాసనసభ నిర్ణయం తీసుకుంది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై జరిగిన చర్చకు సమాధానమిచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఎలాంటి శషభిషలకు తావులేకుండా విచారణ జరగాలనేదే తమ ఉద్దేశ్యమని అన్నారు. నిజాయితీ పారదర్శకతతో కూడిన విచారణ జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
అంతరాష్ట్ర అంశాలు ఇమిడి ఉన్నందుకే సీబీఐకి…ప్రాజెక్టు నిర్మాణంలో అనేక కేంద్ర సంస్థలు, అంతరాష్ట్ర అంశాలు ఇమిడి ఉన్నందుకే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ)కు అప్పగిస్తున్నట్లు సీఏం రేవంత్ రెడ్డి తెలిపారు. క్రిమినల్ చర్యలకు అర్హమైన అనేక లోపాలు, అవకతవకలను జస్టిస్ ఘోష్ కమిషన్ తన నివేదికలో తెలిపారని అన్నారు. నిర్లక్ష్యం, దురుద్దేశం, ఉద్దేశపూర్వకంగా వాస్తవాలను తొక్కిపెట్టడం, ఆర్థిక అవకతవకల వంటి అంశాలను కమిషన్ ప్రస్తావించిందని అన్నారు.
also read:https://teluguprabha.net/telangana-news/telangana-cabinet-kaleshwaram-report-sunday-assembly/
తొమ్మిదిన్నర గంటల పాటు సుదీర్ఘ చర్చ..కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో జరిగిన అవకతవకలు , అవినీతి ఆరోపణలపై విచారణ కోసం తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలో విచారణ కమిషన్‌ను నియమించడం జరిగింది. ఈ కమిషన్ తన నివేదికను జూలై 31న ప్రభుత్వానికి సమర్పించింది. ఆగస్టు 4న జరిగిన మంత్రిమండలి సమావేశంలో ఆ నివేదికను ఆమోదించారు. తదుపరి చర్చ కోసం నివేదికను శాసనసభ ముందు ఉంచాలని నిర్ణయించడంతో…ఈ అంశంపై శాసనసభలో చర్చ జరిగింది. అంతకుముందు జస్టిస్ పినాకి చంద్రఘోష్ విచారణ కమిషన్ నివేదికను నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శాసనసభ ముందుంచారు. కాళేశ్వరంపై దాదాపు తొమ్మిదిన్నర గంటల పాటు సభలో సుదీర్ఘమైన చర్చలు, వాదోపవాదనల అనంతరం ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ శాసనసభ నిర్ణయం తీసుకుంది.


