Telangana government released compensation for the victims of Montha: మొంథా తుఫాను బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. మొంథా తుఫాను ధాటికి కురిసిన భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన బాధిత కుటుంబాలకు నష్ట పరిహారం విడుదల చేసింది ప్రభుత్వం. ప్రస్తుతానికి, ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన రైతులకు నష్టపరిహారం విడుదల చేసింది. తుఫాన్ బాధితుల సహాయార్థం మొత్తం రూ.12 కోట్ల 12 లక్షల నష్టపరిహారాన్ని విడుదల చేసింది. ఈ నిధులు ప్రధానంగా ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్న కుటుంబాలకు పంపిణీ చేయనున్నట్లు తెలిపింది. మొంథా తుఫాన్ ప్రభావం తెలంగాణపై చాలా తీవ్రంగా పడింది. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వరంగల్, హనుమకొండ నగరాల్లో భారీ వర్షాలు, వరదలు జనజీవనాన్ని స్తంభింపజేశాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో జిల్లాలో లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. అనేక చోట్ల ఇళ్లు పాక్షికంగా కూలిపోయాయి. వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేసిన ప్రభుత్వం, నష్టాన్ని అంచనా వేసి తక్షణమే పరిహారాన్ని విడుదల చేసింది. ముఖ్యంగా, వరద ప్రభావాన్ని ఎదుర్కొన్న వరంగల్, హనుమకొండ కార్పొరేషన్లపై ప్రభుత్వం దృష్టి సారించింది. వరంగల్ నగరంలో మొత్తం 3,368 ఇళ్లు పాక్షికంగా ధ్వంసం అయినట్లు అధికారులు గుర్తించారు. ఈ బాధితులకు ఇంటికి రూ.15 వేల చొప్పున పరిహారం చెల్లించడానికి గాను ప్రభుత్వం రూ.5,05,20,000 విడుదల చేసింది. అలాగే, హనుమకొండ నగరంలో వరద ప్రభావం ఎక్కువగా నమోదైంది. ఇక్కడ ఏకంగా 4,691 ఇళ్లు పాక్షికంగా ధ్వంసం కాగా.. ఇక్కడి బాధితుల కోసం నష్టపరిహారం కింద రూ.7,03,65,000 నిధులను రేవంత్ సర్కార్ విడుదల చేసింది. ఈ భారీ మొత్తాన్ని విడుదల చేయడం ద్వారా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వేలాది బాధితులకు అండగా నిలిచింది.
ఒక్కో ఇంటికి రూ. 15 వేల చొప్పున నష్ట పరిహారం..
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రధాన నగరాలతో పాటు.. ఇతర ప్రాంతాలలో కూడా పాక్షికంగా ఇళ్లు దెబ్బతిన్నాయి. ఇందులో భాగంగా మహబూబాబాద్ జిల్లాలో దెబ్బతిన్న 16 ఇళ్లకు గాను ఒక్కొక్క ఇంటికి రూ.15 వేల చొప్పున మొత్తం రూ.2,40,000 పరిహారం అందించారు. అదేవిధంగా, ములుగు జిల్లాలో ధ్వంసమైన 5 ఇళ్లకు గాను రూ.75 వేలు విడుదల చేశారు. బాధిత కుటుంబాలకు త్వరగా పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి జిల్లా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు అందాయి. ఇలా, మొంథా తుఫాన్ బాధితుల సహాయార్థం రూ.12 కోట్ల 12 లక్షల పరిహారాన్ని విడుదల చేసి బాధితులకు ప్రభుత్వం అండగా నిలిచింది. పంట నష్టపోయిన రైతులకు కూడా ఎకరాకు రూ.10 వేలు, మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం, నష్ట అంచనాలను మరింత వేగవంతం చేసి మిగిలిన సహాయాన్ని కూడా త్వరలోనే అందజేస్తామని భరోసా కల్పించింది.


