Telangana Government Shuts Down All RTA Check Posts: రాష్ట్రంలోని చెక్ పోస్టుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రవాణా శాఖ చెక్ పోస్టులను తక్షణం మూసివేస్తున్నట్లు ప్రకటించింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రవాణా శాఖ బుధవారం అత్యవసర ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని రహదారులపై వాహనాల రాకపోకలు ఎటువంటి అంతరాయం లేకుండా సాగేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. రవాణా శాఖ కమిషనర్ తాజా ఉత్తర్వుల్లో, అన్ని డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్లు (DTCs), జిల్లా ట్రాన్స్‌పోర్ట్ అధికారులు (DTOs) తక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టంగా పేర్కొన్నారు. అక్టోబర్ 22 సాయంత్రం 5 గంటలలోపు చెక్‌పోస్టుల మూసివేతను పూర్తి చేసి, పూర్తి స్థాయి నివేదికను సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు, చెక్‌పోస్టుల వద్ద ఉన్న బోర్డులు, బారికేడ్లు, సిగ్నేజ్‌లను తొలగించాలని, అక్కడ విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందిని ఇతర శాఖల్లో తిరిగి నియమించాలని సూచించారు. ఇకపై చెక్‌పోస్టుల వద్ద ఎటువంటి కార్యకలాపాలు జరగకూడదని, వాహనాల రాకపోకలకు అడ్డంకులు లేకుండా చూడాలని అధికారులు స్పష్టం చేశారు. అదేవిధంగా, చెక్‌పోస్టుల వద్ద ఉన్న పరికరాలు, కంప్యూటర్లు, రికార్డులు, ఫర్నీచర్‌ను వెంటనే సంబంధిత జిల్లా ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయాలకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. అన్ని ఆర్థిక, పరిపాలనా రికార్డులను పరిశీలించి భద్రపరచాలని, ఏ వస్తువు మిగలకుండా చూడాలని సూచించారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా తగిన ప్రకటనలు ఇవ్వాలని కూడా కమిషనర్ స్పష్టం చేశారు.
ఆర్టీఏ మెరుపుదాడుల్లో సంచలన విషయాలు..
తెలంగాణలో చెక్‌పోస్టుల మూసివేత నిర్ణయం రవాణా వ్యవస్థలో పారదర్శకత పెంచి, అనవసర ఆలస్యం నివారించడానికి ఉపయోగపడుతుందని అధికారులు పేర్కొన్నారు. వాణిజ్య వాహనాల కదలిక వేగంగా జరిగి, వ్యాపార కార్యకలాపాలకు ఊతం లభిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, కేంద్రం తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణలో భాగంగానే ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితమే చెక్‌పోస్టులను మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ, వాటి కార్యకలాపాలు కొనసాగడంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో చివరికి ఆయన ఆదేశాల మేరకు రవాణా శాఖ తక్షణ చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. కాగా గత ఆదివారం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆర్టీఏ చెక్ పోస్టులపై ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. సంగారెడ్డి, కామారెడ్డి, కొమరం భీం, భద్రాద్రి కొత్తగూడెం, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లోని చెక్ పోస్టులపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ క్రమలో ఆయా చెక్ పోస్టుల వద్ద భారీగా అవినీతి జరుగుతుందని తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తాజా నిర్ణయం తెలంగాణ రవాణా వ్యవస్థకు కొత్త దిశ చూపనుందని, సాంకేతిక ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థతో భవిష్యత్తులో పన్ను వసూలు, వాహనాల నియంత్రణ వ్యవస్థ మరింత సమర్థవంతంగా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తాజా ఉత్తర్వులతో ప్రభుత్వం తర్వాత ఏం చేయబోతుందనే విషయం ఆసక్తిగా మారింది.


