తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో జరిగే సూచనలు కన్పించడం లేదు. బీసీ రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం తీసుకున్న కీలకమైన నిర్ణయం ఇందుకు కారణం. అసలేం జరిగింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం..
తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 9 రాజకీయంగా వేడి రగుల్చుతోంది. ఈ అంశంపై తెలంగాణ హైకోర్టు ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. 42 శాతం రిజర్వేషన్లను నిలిపివేయడంతో స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ పడింది. అయితే పాత పద్ధతిలో అంటే..మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించకుండా ఉంటే ఎన్నికలు జరపవచ్చని కోర్టు సూచించింది. హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ఎన్నికల సంఘం క్లారిటీ కోరడంతో హైకోర్టు ఈ విషయాన్ని వెల్లడించింది. అంటే ఒకవేళ పెంచిన బీసీ రిజర్వేషన్లను వెనక్కి తీసుకుంటే ఎన్నికలు సజావుగా జరిగేందుకు వీలుంటుంది.
కానీ తెలంగాణ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల అంశంపై వెనక్కి తగ్గే సూచనలు కన్పించడం లేదు. ఇదే అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్, సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్విలతో సుదీర్ఘంగా చర్చ జరిగింది. అనంతరం బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు సర్వోన్నత న్యాయస్థానంలో స్పెషల్ లీవ్ పిటీషన్ వేయనుంది. త్వరలో జరగనున్న మంత్రివర్గ సమావేశంలో సుప్రీంకోర్టులో ఎప్పుడు పిటీషన్ దాఖలు చేయాలి, ఎన్నికల నిర్వహణ పరిస్థితి, రిజర్వేషన్ నిష్పత్తి అంశాలపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.
అంటే ఇప్పట్లో తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగేట్టు లేవు. బీసీ రిజర్వేషన్లు 50 శాతం మించకూడదనే అంశానికి సుప్రీంకోర్టు కూడా నిరాకరించే అవకాశాల్లేవు. అటు ప్రభుత్వం కూడా రిజర్వేషన్ల విషయంలో వెనక్కి తగ్గే ఆలోచన చేయడం లేదు. ఫలితంగా ఎన్నికలు తిరిగి ఎప్పుడు జరుగుతాయనేది సందేహమే. ఈ రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉంటుంది, న్యాయస్థానాల్లో ఏం జరగనుందో గానీ..రాష్ట్ర రాజకీయాల్లో మాత్రం కీలక మలుపు ఖాయమని తెలుస్తోంది.


