Telangana Wrote letter to Central Government: ఏపీ ప్రభుత్వం తలపెట్టిన గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య అగ్గి రాజేసింది. ఈ ప్రాజెక్టు తెలుగు రాష్ట్రాలకు ఉపయోగకరమని ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణకు తీవ్ర నష్టమని ఆ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి అభ్యంతరం చెబుతున్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం..కేంద్రం వెంటనే స్పందించి ఆ ప్రాజెక్టుకు అనుమతులు నిరాకరించడం చకచకా జరిగిపోయింది. ఈ క్రమంలో బనకచర్ల ప్రాజెక్టుపై చర్చించేందుకు రెండు రాష్ట్రాల సీఎంలతో చర్చకు సిద్ధమైంది. ఈమేరకు కేంద్ర జలశాఖ మంత్రి సీఆర్ పాటిల్ అధ్యక్షతన జులై 16న జరిగే సమావేశానికి ఇద్దరు సీఎంలను ఢిల్లీకి రావాలని ఆహ్వానించింది.
బనకచర్లపై చర్చించేందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలకు కేంద్రం పిలుపునిచ్చిన నేపథ్యంలో కేవలం ఈ ప్రాజెక్టుపై మాత్రమే చర్చించాలని ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఎజెండాపై తెలంగాణ సర్కార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. బనకచర్ల ప్రాజెక్టుపై చర్చ అవసరం లేదని లేఖలో స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టుపై జీఆర్ఎంబీ, సీడబ్ల్యూసీ, ఈఏసీ అభ్యంతరాలు తెలిపాయని గుర్తుచేసింది. బనకచర్ల ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు లేవని.. మరి అలాంటప్పుడు దీనిపై చర్చ అనవసరమని ప్రస్తావించింది.
అంతేకాకుండా కృష్ణా నదిపై పెండింగ్ ప్రాజెక్టులకు అనుమతులను అజెండాగా ప్రతిపాదించింది. అలాగే పాలమూరు, దిండి ప్రాజెక్టులకు జాతీయహోదా, ఇచ్చంపల్లి 200 టీఎంసీల వరద జలాల వినియోగానికి కొత్త ప్రాజెక్ట్ నిర్మాణం, తుమ్మడిహెట్టి వద్ద ప్రాణహిత ప్రాజెక్టుకు 80 టీఎంసీలు కేటాయింపులపై చర్చ చేపట్టాలని సూచించింది. ఇలాంటి చర్చలు కేంద్ర ప్రభుత్వ సంస్థల విశ్వసనీయత దెబ్బ తింటుందని లేఖలో ప్రస్తావించింది.
Also Read: సీఎం చంద్రబాబు ఢిల్లీ టూర్ ఫుల్ షెడ్యూల్ ఇదే.. ఎవరెవరిని కలవనున్నారంటే?
కాగా బనకచర్ల ప్రాజెక్టు అంశంపై తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డిలతో కేంద్ర జలశక్తిశాఖ మంత్రి సీఆర్ పాటిల్ జులై 16న సమావేశం నిర్వహించారు. ఈ మేరకు ఇరు రాష్ట్రాల సీఎంల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు సమాచారం అందించింది. ఢిల్లీలోని జలశక్తిశాఖ ప్రధాన కార్యాలయం శ్రమశక్తి భవన్‌లో బుధవారం మధ్యాహ్నం 2.30 గంటలకు సమావేశం జరనుంది. దీంతో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు తమ ఎజెండాలు పంపించాలని కోరింది. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం రెండు రాష్ట్రాలు చేపట్టిన కొత్త ప్రాజెక్టులు, జల వివాదాలకు సంబంధించిన అంశాలను కేంద్ర జలశక్తి మంత్రి ఛైర్మన్‌గా, రెండు రాష్ట్రాల సీఎంలు సభ్యులుగా ఉండే ఎపెక్స్ కౌన్సిల్‌లో చర్చించాల్సి ఉంది. గత పదేళ్లలో కేవలం రెండు సార్లు మాత్రమే సమావేశాలు జరిగాయి.


