Thursday, January 22, 2026
HomeతెలంగాణElection code : ప్రభుత్వ ఉద్యోగులారా.. బీ అలర్ట్! ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే ఉద్యోగం ఊడినట్లే!

Election code : ప్రభుత్వ ఉద్యోగులారా.. బీ అలర్ట్! ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే ఉద్యోగం ఊడినట్లే!

Election code of conduct for government employees : గ్రామ గ్రామాన పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఈ సమయంలో, ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ పార్టీల సభల్లో, ప్రచారాల్లో పాల్గొంటున్నారా? వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో ఫలానా పార్టీకి మద్దతుగా పోస్టులు పెడుతున్నారా? అయితే, తస్మాత్ జాగ్రత్త! మీ ఉద్యోగం ప్రమాదంలో పడినట్లే! పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం (TSEC) ప్రభుత్వ ఉద్యోగులకు తీవ్రమైన హెచ్చరికలు జారీ చేసింది. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తే, వేటు వేయడానికి కూడా వెనుకాడబోమని స్పష్టం చేసింది. 

- Advertisement -

స్థానిక ఎన్నికల సమయంలో, కొందరు ప్రభుత్వ ఉద్యోగులు తమకు ఇష్టమైన రాజకీయ పార్టీకి లేదా అభ్యర్థికి అనుకూలంగా, మరికొందరికి వ్యతిరేకంగా ప్రచారం చేయడం, సభల్లో పాల్గొనడం వంటివి చేస్తుంటారు. ఈ ధోరణికి అడ్డుకట్ట వేసేందుకు, ఎన్నికల సంఘం తన నిబంధనలకు పదును పెట్టింది.

ఇవి చేస్తే.. ఉద్యోగం ఊడినట్లే : సభలు, సమావేశాలు: రాజకీయ పార్టీలు, అభ్యర్థులు నిర్వహించే సభలు, సమావేశాలలో చురుకుగా పాల్గొనడం. (ఫొటోలు, వీడియోలు ఆధారంగా చర్యలు తీసుకుంటారు).

సోషల్ మీడియా ప్రచారం: వాట్సాప్, ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాలలో ఏదైనా పార్టీకి అనుకూలంగా లేదా ప్రతికూలంగా పోస్టులు పెట్టడం, షేర్ చేయడం.
ప్రభుత్వ విమర్శ: ప్రభుత్వ పథకాలను విమర్శించడం, ఇష్టారీతిన మాట్లాడటం.
అభిప్రాయ వ్యక్తీకరణ: ఫలానా అభ్యర్థి గెలుస్తాడని, ఫలానా పార్టీ ఓడిపోతుందని బహిరంగంగా వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పడం.

“ఆధారాలతో సహా ఫిర్యాదు అందితే, అనుకూలంగా లేదా వ్యతిరేకంగా ప్రవర్తించే ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఎన్నికలు ముగిసే వరకు రాజకీయ నాయకులతో సన్నిహితంగా మెలగవద్దు,” అని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

అభ్యర్థులూ.. ఈ నియమాలు మీకోసమే : కేవలం ఉద్యోగులకే కాదు, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు కూడా ఎన్నికల సంఘం స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది.
మతాలు, కులాలు, ప్రాంతాల ప్రాతిపదికన ఓట్లు అడగకూడదు.
ప్రార్థనా మందిరాలను ప్రచారానికి వేదికగా చేసుకోకూడదు.
ఓటర్లకు డబ్బు, మద్యం, బహుమతులు పంపిణీ చేయరాదు.
వ్యక్తిగత దూషణలు, ఆధారాలు లేని ఆరోపణలు చేయకూడదు.

ప్రభుత్వ, ప్రైవేట్ గోడలపై యజమానుల అనుమతి లేకుండా రాతలు రాయడం, ఫ్లెక్సీలు కట్టడం నిషిద్ధం. ఈ నిబంధనలను పర్యవేక్షించేందుకు, ఎన్నికల సంఘం ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, వీడియో చిత్రీకరణ బృందాలు, వ్యయ పరిశీలకులతో కూడిన నిఘా బృందాలను ఏర్పాటు చేసింది. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News