Sunday, November 16, 2025
HomeతెలంగాణGOVT EMPLOYEES: జీవో 317 బాధితులకు ఊరట.. మూడేళ్ల డిప్యుటేషన్‌కు ప్రభుత్వం పచ్చజెండా!

GOVT EMPLOYEES: జీవో 317 బాధితులకు ఊరట.. మూడేళ్ల డిప్యుటేషన్‌కు ప్రభుత్వం పచ్చజెండా!

Telangana GO 190 employee deputation : సొంత జిల్లాను వదిలి, పరాయి జిల్లాల్లో పనిచేస్తున్న వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. వివాదాస్పద జీవో 317 ద్వారా నష్టపోయిన వారికి తాత్కాలిక ఉపశమనం కల్పిస్తూ, వారు కోరుకున్న చోట గరిష్ఠంగా మూడేళ్ల పాటు డిప్యుటేషన్‌పై పనిచేసేందుకు అనుమతిస్తూ ‘జీవో 190’ని జారీ చేసింది. అసలు ఏమిటీ జీవో 317 వివాదం..? ఈ కొత్త జీవోతో ఎవరెవరికి ప్రయోజనం చేకూరనుంది..?

- Advertisement -

ఏమిటీ జీవో 317 వివాదం : తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత, ప్రభుత్వ ఉద్యోగులను, ఉపాధ్యాయులను వారి వారి జిల్లాలకు కేటాయించేందుకు, 2021లో నాటి ప్రభుత్వం జీవో 317ను తీసుకొచ్చింది. అయితే, ఈ కేటాయింపు ప్రక్రియలో సీనియారిటీని ప్రామాణికంగా తీసుకోవడంతో, వేలాది మంది జూనియర్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ సొంత జిల్లాలను, కుటుంబాలను వదిలి, వందల కిలోమీటర్ల దూరంలోని ఇతర జిల్లాలకు వెళ్లాల్సి వచ్చింది. స్థానికత ఆధారంగా కాకుండా, సీనియారిటీ ఆధారంగా కేటాయింపులు చేయడంపై అప్పటి నుంచి ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన చేస్తున్నాయి.

ప్రభుత్వ హామీ.. తాత్కాలిక ఉపశమనం : అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా, తాము అధికారంలోకి వస్తే జీవో 317 బాధితులకు న్యాయం చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఆ హామీ మేరకు, అధికారంలోకి వచ్చాక మంత్రి దామోదర్ రాజనర్సింహ నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. ఆ కమిటీ సూచనల మేరకు, ఇప్పటికే స్పౌస్ (భార్యాభర్తలు), పరస్పర బదిలీలకు అవకాశం కల్పించారు.ఇప్పుడు, ఆ బదిలీల్లో అవకాశం రాని మిగిలిన వారికి, తాత్కాలికంగా మూడేళ్ల పాటు వారు కోరుకున్న జిల్లాలో పనిచేసేందుకు డిప్యుటేషన్ సౌకర్యం కల్పిస్తూ ‘జీవో 190’ని జారీ చేశారు.

జీవో 190 ముఖ్యాంశాలు :ఈ తాత్కాలిక బదిలీలకు కొన్ని స్పష్టమైన నిబంధనలను విధించారు. ఈ అవకాశం ప్రతి ఉద్యోగికి ఒక్కసారి మాత్రమే, గరిష్ఠంగా మూడేళ్ల పాటు ఉంటుంది. కోరుకున్న జిల్లాలో, అదే క్యాడర్, అదే విభాగంలో ఖాళీ ఉంటేనే డిప్యుటేషన్‌కు అనుమతిస్తారు. ఇప్పటికే స్పౌస్, పరస్పర బదిలీల ద్వారా లబ్ధి పొందిన వారు, జీవో 317 తర్వాత పదోన్నతి పొందిన వారు ఈ డిప్యుటేషన్లకు అనర్హులు.

క్రమశిక్షణ చర్యలు పెండింగ్‌లో ఉన్నవారిని పరిగణనలోకి తీసుకోరు. ఈ డిప్యుటేషన్ కాలంలో ఎలాంటి టీఏ, డీఏలు చెల్లించరు. ఈ జీవో జారీ పట్ల ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఇది తమ నిరంతర పోరాటానికి లభించిన విజయమని జేఏసీ ఛైర్మన్ మారం జగదీశ్వర్ తెలిపారు. అయితే, ఉపాధ్యాయుల బదిలీల వల్ల పాఠశాలల్లో బోధనకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని టీఆర్‌టీఎఫ్ అధ్యక్షుడు కటకం రమేశ్ కోరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad