Telangana Govt Plans To Establish Solar Plant Units With Self Help Group Members: మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు, స్వయం కృషితో సమాజంలో సగౌరవంగా బ్రతికేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను ప్రవేశపెడుతోంది. మహిళలను పారిశ్రామిక రంగంలో ముందుకు తీసుకెళ్లాలని తెలంగాణ ప్రభుత్వం ముందుచూపుతో అడుగులు వేస్తోంది. ఈ లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘాల ఆధ్వర్యంలో 1000 మెగావాట్ల సౌర శక్తిని ఉత్పత్తి చేసే భారీ ప్రాజెక్టుకు రూపకల్పన పూర్తయింది. పలు జిల్లాల్లో దేవాదాయ శాఖకు చెందిన భూములను గుర్తించగా, త్వరలో సెర్ప్, దేవాదాయ శాఖ మధ్య ఒప్పందం చేసుకునేందుకు సిద్ధమవుతోంది. ఒక్కో గ్రామైక్య సంఘం ఒక మెగావాట్ ఉత్పత్తి చేయగలిగే విధంగా ప్రణాళిక రూపొందించనుంది. మొదటి దశలో 12 మహిళా సంఘాలకు సోలార్ ప్లాంట్లను కేటాయించనున్నారు. ఒక్కో ప్లాంట్ ఏర్పాటు ఖర్చు సుమారు మూడు కోట్లు అవుతుందని అంచనాలను బట్టి తెలుస్తోంది. దాదాపు నాలుగు ఎకరాల భూభాగంలో ప్రతి యూనిట్ ఏర్పాటుకు స్థల సేకరణ సైతం దాదాపు పూర్తయింది. మహిళా సంఘాలకు ఆర్థిక సహాయం అందించేందుకు గానూ స్త్రీనిధి, సెర్ఫ్ సంస్థలు సంయుక్తంగా రుణాలు అందించే విధానం సిద్ధమవుతోంది. మూడుకోట్ల ప్రాజెక్టులో భాగంగా సంఘాలు పది శాతం మార్జిన్ మనీగా 30 లక్షలు జమ చేయాల్సి ఉంది. ఈ మొత్తం సమకూర్చడంలో అడ్డంకులు రాకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ప్రభుత్వం పరిశీలిస్తుంది.
సోలార్ ఉత్పత్తికి 4 వేల ఎకరాల అవసరం..
అయితే, రాష్ట్రవ్యాప్తంగా 1000 మెగావాట్ల సోలార్ ఉత్పత్తికి దాదాపు నాలుగు వేల ఎకరాల భూమి అవసరం. సబ్ స్టేషన్ల సమీపంలోనే ప్లాంట్లు ఏర్పాటు చేసే విధంగా సమగ్ర ప్రణాళిక రూపొందించారు. ఇప్పటికే డీఆర్డీఓ, గ్రామైక్య సంఘాలు పలు జిల్లాల్లో భూ సేకరణకు సంబంధించిన అన్ని వివరాలను క్రోడీకరించాయి. రాష్ట్రంలో థర్మల్, హైడల్ ఉత్పత్తి డిమాండ్‌కు సరిపోకపోవడంతో, సోలార్ విద్యుత్‌ను డిస్కంలకు విక్రయించడం ద్వారా మహిళా సంఘాలకు స్థిర ఆదాయ వనరు ఏర్పడనుంది. ఒక్కసారి ప్లాంట్లు అమల్లోకి వచ్చిన తర్వాత కనీసం 24 సంవత్సరాల పాటు స్థిరంగా విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. నిర్వహణ వ్యయం తక్కువగా ఉండటం, లాభాలు ఎక్కువగా ఉండటం మహిళా సంఘాలకు ప్రధాన బలం చేకూరనుంది. ఇలా మహిళలకు ప్రతినెలా కొంత నగదు జమ కావడంతో ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. తద్వారా, వారి కుటుంబాలు పేదరికం నుంచి బయటపడి, వృద్ధి చెందుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని విధివిధానాలను అందించే ప్రత్యేక వెబ్‌సైట్‌ను కూడా ప్రభుత్వం త్వరలో అందుబాటులోకి తెస్తుంది. గ్రామీణ మహిళల సాధికారత, పునరుత్పాదక శక్తి విస్తరణ, రాష్ట్ర ఆర్థిక స్థిరత్వం, ఈ మూడు లక్ష్యాలను చేరుకునే దిశగా సోలార్ శక్తి ప్రాజెక్టు కీలక మలుపు కానుంది.


