Telangana government land reclamation : ఐదు దశాబ్దాలుగా అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూమికి విమోచనం లభించింది. రాజకీయ అండదండలతో, అధికారుల అలసత్వాన్ని ఆసరాగా చేసుకుని కబ్జాకోరల్లో చిక్కుకున్న వందల ఎకరాల విలువైన నేలకు స్వేచ్ఛ లభించింది. ఖమ్మం జిల్లాలో కళ్లెదుటే జరుగుతున్న ఈ మహాదోపిడీకి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చొరవతో రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. అసలు నాగార్జునసాగర్ ప్రాజెక్టు కోసం సేకరించిన భూములు దశాబ్దాలుగా అక్రమార్కుల పాలెలా అయ్యాయి? ఇన్నేళ్లుగా కనిపించని దస్త్రాలు ఇప్పుడు ఎలా బయటపడ్డాయి? ఒక వరద సమస్య పరిష్కారం.. ఈ భారీ భూ కుంభకోణాన్ని ఎలా బట్టబయలు చేసింది? ఈ ‘ఆపరేషన్’ వెనుక జరిగిన కథేంటి?
ప్రభుత్వ ఆస్తి అంటే పైసా ఖర్చు లేకుండా దోచుకోవచ్చనే ధోరణికి చరమగీతం పాడుతూ, ఖమ్మం జిల్లాలో అధికార యంత్రాంగం ఉక్కుపాదం మోపింది. ఏకంగా 50 ఏళ్లుగా అక్రమార్కుల ఆధీనంలో ఉన్న సుమారు 800 ఎకరాల నాగార్జునసాగర్ ప్రాజెక్టు (ఎన్నెస్పీ) భూములను పరిరక్షించే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రత్యేక చొరవతో కదిలిన అధికారులు, ఇప్పటివరకు రూ.378 కోట్ల విలువైన 420.08 ఎకరాలను స్వాధీనం చేసుకుని ప్రభుత్వ పరం చేశారు.
దశాబ్దాల దందా.. దస్త్రాల దుమ్ముదులిపారు : 1968లో నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఎడమ కాల్వల తవ్వకం, మట్టి కట్టల నిర్మాణం కోసం ప్రభుత్వం రైతుల నుంచి భూములను సేకరించింది. కాల్వ పనులు పూర్తయ్యాక, మట్టిని తవ్విన ప్రదేశాల్లో ఏర్పడిన గుంతలను కొందరు అక్రమార్కులు పూడ్చివేశారు. రాజకీయ నాయకుల అండతో ఆ భూములను చదును చేసి, సాగుభూములుగా మార్చుకున్నారు. అంతటితో ఆగకుండా, కొందరు రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై ఏకంగా పట్టా పాసుపుస్తకాలు సైతం పొందడం గమనార్హం. ఇటీవల స్థిరాస్తి వ్యాపారం ఊపందుకోవడంతో, ఈ ప్రభుత్వ భూముల్లో వెంచర్లు వేసి, ఇళ్ల స్థలాలుగా విక్రయించేందుకు కూడా సన్నద్ధమయ్యారు.
ఒక సమస్య పరిష్కారం.. మరో కుంభకోణం బట్టబయలు : ఏటా మున్నేరు నది వరదలతో ఖమ్మం నగరం, ఏదులాపురం వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు, నదికి ఇరువైపులా కాంక్రీటు కరకట్ట (రిటైనింగ్ వాల్) నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్మాణం కోసం ప్రైవేటు భూములను సేకరించాల్సి ఉండగా, భూములు కోల్పోతున్న నిర్వాసితులకు పునరావాసం కల్పించేందుకు పోలేపల్లి గ్రామంలోని ప్రభుత్వ భూములను పరిశీలించాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే ఎన్నెస్పీ స్థలాలు భారీగా ఆక్రమణకు గురైనట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దృష్టికి వచ్చింది. ఆయన తక్షణమే విచారణకు ఆదేశించడంతో అసలు కుంభకోణం బట్టబయలైంది.
క్షేత్రస్థాయిలో ఉక్కుపాదం.. పక్కా ప్రణాళికతో స్వాధీనం : మంత్రి ఆదేశాలతో ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సారథ్యంలో అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, మంత్రి ఓఎస్డీ రమేశ్, నీటిపారుదల శాఖ ఈఈ రమేశ్ రెడ్డి, అర్బన్, రూరల్ తహసీల్దార్లు రంగంలోకి దిగారు.
దస్త్రాల పరిశీలన: 1968 నాటి భూసేకరణకు సంబంధించిన అవార్డు ప్రతుల రికార్డులను వెలికితీశారు. సుమారు 10 వేల పేజీల దస్త్రాలను క్షుణ్ణంగా పరిశీలించి, అసలు హద్దులను గుర్తించారు.
క్షేత్రస్థాయి సర్వే: పాత రికార్డుల ఆధారంగా క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి, కబ్జాకు గురైన ఎన్నెస్పీ, ఇతర ప్రభుత్వ భూములను గుర్తించారు.
స్వాధీనం: తొలిదశలో ఖమ్మం నగరం సమీపంలోని పోలేపల్లిలో అత్యధికంగా 299.08 ఎకరాలు, నేలకొండపల్లిలో 47, ముత్తగూడెం 35, మద్దులపల్లిలో 24, ఏదులాపురంలో 10, తిరుమలాయపాలెం, బారుగూడెంలో మరో 5 ఎకరాలు కలిపి మొత్తం 420.08 ఎకరాలను స్వాధీనం చేసుకున్నారు.
పట్టాల రద్దు, హద్దు రాళ్లు: ఈ భూముల్లో గతంలో అక్రమంగా జారీ చేసిన 30 ఎకరాల పట్టాలను అధికారులు రద్దు చేశారు. స్వాధీనం చేసుకున్న భూముల చుట్టూ రూ.25 లక్షల వ్యయంతో హద్దు రాళ్లను పాతించి, ప్రభుత్వ ఆస్తిగా బోర్డులను ఏర్పాటు చేశారు.
“ఖమ్మం గ్రామీణ మండలంలోని పలు గ్రామాల పరిధిలో మరో 400 ఎకరాల ఎన్నెస్పీ భూములు కబ్జాలో ఉన్నాయి. వాటినీ త్వరలోనే స్వాధీనం చేసుకుంటాం.”
– రమేశ్ రెడ్డి, ఈఈ, నీటిపారుదల శాఖ
“పాలేరు నియోజకవర్గంలో ఆక్రమణకు గురైన ప్రతి అంగుళం ప్రభుత్వ భూమిని పరిరక్షిస్తాం. డిజిటల్ మ్యాపులు రూపొందించి శాశ్వత పరిష్కారం చూపిస్తాం. ఇదే స్ఫూర్తితో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ భూముల సంరక్షణకు చర్యలు తీసుకుంటాం.”
– పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి

