Telangana pre-primary education expansion : ప్రైవేటు బడుల ఫీజుల మోత మోయలేక సతమతమవుతున్న తల్లిదండ్రులకు శుభవార్త! ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుండటంతో ఆందోళన చెందుతున్న విద్యావేత్తలకు ఓ ఆశాకిరణం! సర్కారు బడుల స్వరూపాన్నే మార్చేసే బృహత్తర ప్రణాళికకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అసలు ప్రభుత్వ పాఠశాలల వైపు విద్యార్థులను ఆకర్షించేందుకు సర్కారు వేస్తున్న ఈ కొత్త ఎత్తుగడ ఏమిటి? దీనివల్ల పేద, మధ్యతరగతి కుటుంబాలకు కలిగే ప్రయోజనం ఎంత? వేల సంఖ్యలో రాబోతున్న ఈ ‘చిన్న’ ఉద్యోగాల స్వరూపం ఏంటి? ఈ పథకం ప్రభుత్వ బడుల తలరాతను మారుస్తుందా?
రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాల విద్యకు పునరుజ్జీవం కల్పించే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పూర్వ ప్రాథమిక విద్య (Pre-Primary Education)ను బలోపేతం చేయడమే లక్ష్యంగా, వచ్చే విద్యా సంవత్సరం (2026-27) నుంచి మరో 4,900 ప్రభుత్వ పాఠశాలల్లో యూకేజీ తరగతులను ప్రారంభించాలని ప్రాథమికంగా నిర్ణయించింది.
ఎందుకీ నిర్ణయం? సమస్య ఎక్కడ ఉంది : గత కొంతకాలంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఆందోళనకరంగా తగ్గుతోంది.
విఫలమైన ఆంగ్ల మాధ్యమం: విద్యార్థులను ఆకర్షించేందుకు 2022-23 విద్యా సంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టినా ఆశించిన ఫలితాలు రాలేదు. పైగా ఎన్‌రోల్‌మెంట్ మరింత తగ్గింది.
మూలాల్లోనే లోపం: ప్రభుత్వ బడుల్లో ప్రైవేటు పాఠశాలల తరహాలో నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ వంటి ప్రీ ప్రైమరీ తరగతులు లేకపోవడమే విద్యార్థుల సంఖ్య తగ్గడానికి ప్రధాన కారణమని ఉపాధ్యాయ సంఘాలు, విద్యా కమిషన్ సైతం ప్రభుత్వానికి సూచించాయి. తల్లిదండ్రులు తమ పిల్లలను పునాది నుంచే ఒకే పాఠశాలలో చదివించాలని భావించి, వేలకు వేలు ఫీజులు చెల్లించి ప్రైవేటు కాన్వెంట్ల వైపు మొగ్గు చూపుతున్నారు. రాష్ట్రంలో ఒకటో తరగతిలో సగటున 6 లక్షల మంది ఉంటే, వారిలో కేవలం 1.66 లక్షల మంది మాత్రమే సర్కారు బడుల్లో చేరుతుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
ప్రభుత్వ ప్రణాళిక.. అమలు ఇలా : ఈ సమస్యకు పరిష్కారంగా, విద్యావేత్తల సూచనల మేరకు ప్రభుత్వం ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
విస్తరణ ప్రణాళిక: ఈ ఏడాది ప్రయోగాత్మకంగా 1000 పాఠశాలల్లో ప్రారంభించిన యూకేజీ తరగతులకు మంచి స్పందన రావడంతో, వచ్చే ఏడాది (2026-27) దీనిని మరో 4,900 పాఠశాలలకు విస్తరించాలని నిర్ణయించారు.
ఉద్యోగాల కల్పన: ప్రతి పాఠశాలలో ఒక టీచర్ (ఇన్‌స్ట్రక్టర్), ఒక ఆయాను నియమించనున్నారు. అంటే ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 9,800 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
దశలవారీగా అమలు: రాష్ట్రంలోని 12,700 గ్రామ పంచాయతీల్లో, దశల వారీగా ప్రతి పంచాయతీ పరిధిలోని ఒక పాఠశాలలో ఈ ప్రీ ప్రైమరీ విద్యను అందుబాటులోకి తీసుకురావాలన్నది ప్రభుత్వ దీర్ఘకాలిక లక్ష్యం.
ప్రస్తుత పరిస్థితి – గణాంకాల సాక్షిగా : ప్రస్తుతం రాష్ట్రంలో సమగ్ర శిక్షా, పీఎం శ్రీ, ప్రభుత్వ నిధులతో కలిపి మొత్తం 1,362 పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు నడుస్తున్నాయి. ఈ పాఠశాలల్లో మొత్తం 8,976 మంది చిన్నారులు విద్యనభ్యసిస్తున్నారు.ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వం ఈ పథకం కోసం రూ.35.77 కోట్లు విడుదల చేసింది.
భవిష్యత్తు ఆశలు.. సవాళ్లు : ప్రస్తుతం నాలుగేళ్లు నిండిన పిల్లలను యూకేజీలో మాత్రమే చేర్చుకుంటున్నారు. అయితే ప్రైవేటు బడుల తరహాలో నర్సరీ, ఎల్‌కేజీలను కూడా ప్రారంభించాలని విద్యావేత్తల నుంచి డిమాండ్ వస్తోంది. ఈ నిర్ణయం వల్ల వేల రూపాయల ఫీజులు కట్టలేని పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఊరట లభించనుంది. అయితే, ఈ నిర్ణయం కాగితాలకే పరిమితం కాకుండా, చిత్తశుద్ధితో అమలు చేసి, నాణ్యమైన బోధన అందిస్తేనే ప్రభుత్వ బడులు మళ్లీ విద్యార్థుల కిలకిలరావాలతో పూర్వ వైభవాన్ని సంతరించుకోవడం ఖాయం.


