ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం రెండో రోజు సింగపూర్ పర్యటన విజయవంతమైంది. రాష్ట్రంలో రూ. 3,500 కోట్ల పెట్టుబడులకు ఎస్టీ టెలీ మీడియా గ్లోబల్ డేటా సెంటర్ ముందుకు వచ్చింది. ముచ్చర్ల సమీపంలోని మీర్ఖాన్ పేటలో అత్యాధునిక ఏఐ ఆధారిత డేటా సెంటర్ క్యాంపస్‌ను స్థాపించేందుకు ఈ కంపెనీ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (MoU) చేసుకుంది.
సీఎం రేవంత్ రెడ్డి, ఐటీశాఖ మంత్రి శ్రీధర్ బాబు సింగపూర్‌లోని ఎస్టీటీ గ్లోబల్ డేటా సెంటర్ ఆఫీస్ సందర్శించారు. అనంతరం కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సమక్షంలో పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, ఎస్ టీటీ గ్రూప్ సీఈవో బ్రూనో లోపెజ్ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. 100 మెగావాట్ల సామర్థ్యంతో హైదరాబాద్‌లో ఏర్పాటు చేసే అత్యాధునిక అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెడీ డేటా సెంటర్‌ను ఈ కంపెనీ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నెలకొల్పనుంది.
భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా డేటా సెంటర్ సామర్థ్యాన్ని పెంచుకునే సదుపాయం కూడా ఉంది. దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్లలో ఇది ఒకటిగా నిలుస్తుంది. దాదాపు రూ.3,500 కోట్ల పెట్టుబడులతో ఈ ప్రాజెక్టు చేపట్టేందుకు ఆ కంపెనీ ముందుకురావటం తెలంగాణలో ఉన్న మౌలిక సదుపాయాలను, ప్రపంచస్థాయి అనుకూలతలను చాటి చెప్పింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. త్వరలోనే హైదరాబాద్ డేటా సెంటర్లకు రాజధానిగా అవతరిస్తుందని అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల నిర్ణయం తీసుకున్నందుకు ఎస్టీటీ గ్లోబల్ కంపెనీ ప్రతినిధులను అభినందించారు.
ఇక తెలంగాణ ప్రభుత్వం తో కలిసి పనిచేయడం గౌరవంగా ఉందని.. ఎస్టీటీ మీడియా గ్లోబల్ డేటా సెంటర్స్ ప్రెసిడెంట్, గ్రూప్ సీఈవో బ్రూనో లోపెజ్ అన్నారు.
హైదరాబాద్ ప్రపంచానికి డేటా హబ్ గా మారుతుందని.. ఈ సందర్భంగా ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఏఐ ఆధారిత రంగంలో వస్తున్న వినూత్న మార్పుల్లో హైదరాబాద్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని చెప్పారు. ప్రస్తుతం ఈ కంపెనీ హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో డేటా సెంటర్‌ను నిర్వహిస్తోంది. కొత్త క్యాంపస్ ఏర్పాటుతో కంపెనీ కార్యకలాపాలను విస్తరించనుందని తెలిపారు. ఈ కంపెనీ పదేండ్లలో మన దేశంలో ఒక గిగావాట్ సామర్థానికి విస్తరించాలనే భవిష్యత్తు లక్ష్యంతో తెలంగాణలో పెట్టుబడులు పెడుతోంది. దశాబ్దంలో ఈ కంపెనీ దాదాపు 3.2 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడుతుందని శ్రీధర్ బాబు అంచనా వేశారు.