Group1 Exams| తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఈనెల 21 నుంచి ఇవాళ్టి వరకు ఏడు రోజుల పాటు ప్రతి రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరిగాయి. అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు హాజరై పరీక్షలు రాసి తమ అదృష్టం పరీక్షించుకున్నారు. అయితే కొంతమంది అభ్యర్థులు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన జోవో నెంబర్ 29ను రద్దు చేయాలని ఆందోళనలకు దిగారు. అయినా కానీ ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గకుండా పరీక్షలు నిర్వహించింది.
కాగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలుత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రిలిమ్స్ పరీక్షలు రెండు దఫాలుగా జరిగాయి. అయితే రెండు సార్లు కూడా వాయిదా పడ్డాయి. ఆ తరువాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత పాత నోటిఫికేషన్‌కి కొన్ని పోస్టులను కలిపి కొత్తగా నోటిఫికేషన్ విడుదల చేసింది. అనంతరం ప్రిలిమ్స్ పరీక్షలు నిర్వహించింది. ఇందులో 31వేలకు పైగా మెయిన్స్ పరీక్షలకు సెలెక్ట్ అయ్యారు. వీరిలో దాదాపు 25వేల మందికి పైగా అభ్యర్థులు పరీక్షలు రాసినట్లు అధికారులు తెలిపారు.