Heavy Rains Alert: తెలంగాణ రాష్ట్రానికి భారీ వర్షసూచన జారీ అయింది. కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. మరో నాలుగు రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు పడవచ్చని వెల్లడించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇవాళ తీవ్రంగా బలపడింది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ వాయుగుండంగా మారనుందని ఐఎండీ తెలిపింది. తుపానుగా మారే అవకాశాలు లేకపోలేదని అంచనా వేస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్షాల హెచ్చరిక జారీ అయింది. తాజాగా తెలంగాణలోని పలు జిల్లాల్లో అక్టోబర్ 26 వరకు భారీ వర్షాలు పడవచ్చని ఐఎండీ తెలిపింది. ఈ జిల్లాలకు ఇప్పటికే ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఇవాళ కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షాలు పడనున్నాయి. పిడుగులు సైతం పడే ప్రమాదం ఉన్నందున చెట్లు, టవర్లు, పొలాల్లో ఉండవద్దని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరిస్తోంది.
ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
తెలంగాణలోని 20 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, మేడ్చల్ రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, జిల్లాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. వాతావరణంలో వచ్చిన మార్పు కారణంగా అనారోగ్యం బారిన పడవచ్చని అటు వైద్యులు సైతం చెబుతున్నారు. చలితీవ్రత పెరగవచ్చంటున్నారు.


