Saturday, November 15, 2025
HomeతెలంగాణSigachi: సిగాచీ ఫ్యాక్టరీ పేలుడు.. ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలు!

Sigachi: సిగాచీ ఫ్యాక్టరీ పేలుడు.. ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలు!

Industrial Safety Negligence: సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచీ పరిశ్రమలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంపై తెలంగాణ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. యాజమాన్యం నిర్లక్ష్యం, ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ దుర్ఘటన జరిగిందంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం, రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.మూడు వారాల్లోగా పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.అసలు ఈ ప్రమాదానికి కారకులెవరు..? బాధితులకు న్యాయం ఎప్పుడు జరుగుతుంది..? ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తోంది?… అనే ప్రశ్నలు ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ రేపుతున్నాయి.

- Advertisement -

ప్రమాద తీవ్రత – అంకెలూ అందని విషాదం:

పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచీ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌లో గత నెల 30న సంభవించిన పేలుడు పెను విషాదాన్ని మిగిల్చింది. ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్యపై గందరగోళం నెలకొంది. పిటిషనర్ కథనం ప్రకారం 54 మంది మృతి చెందగా, 28 మంది గాయపడ్డారని, మరో 8 మంది ఆచూకీ లభ్యం కాలేదని తెలుస్తోంది.అయితే, ఇతర వార్తా కథనాల ప్రకారం మృతుల సంఖ్య 44కు చేరినట్లు సమాచారం.పేలుడు ధాటికి కార్మికుల శరీరాలు ఛిద్రమై, గుర్తుపట్టలేని విధంగా కాలి బూడిదయ్యాయి. ఆచూకీ లభించని వారిని మరణించినట్లుగా అధికారులు ప్రకటించడంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది.

కోర్టుకెక్కిన ప్రజా గొంతుక:

ఈ దుర్ఘటనపై కె. బాబురావు అనే వ్యక్తి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. పరిశ్రమలో భద్రతా ప్రమాణాలను యాజమాన్యం గాలికొదిలేయడమే ఈ ఘోరానికి కారణమని ఆయన తన పిటిషన్‌లో ఆరోపించారు. ప్రమాదం జరిగి నెలలు గడుస్తున్నా బాధితులకు ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారం అందలేదని, యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది వసుధా నాగరాజ్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.ప్రమాద కారణాలపై నియమించిన కమిటీ నివేదికను బహిర్గతం చేయాలని, ఈ కేసును సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) కు అప్పగించాలని వారు కోరారు.

ALSO READ: https://teluguprabha.net/telangana-news/telangana-high-court-four-new-judges-sworn-in/

ప్రభుత్వ నిర్లక్ష్యంపై హైకోర్టు ఆగ్రహం:

పిటిషనర్ వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు, ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేసింది. మూడు వారాల్లోగా సమగ్ర వివరణతో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కార్మిక, పరిశ్రమల శాఖల ముఖ్య కార్యదర్శులు, సంగారెడ్డి జిల్లా కలెక్టర్, పోలీసు సూపరింటెండెంట్, ఫ్యాక్టరీస్ డైరెక్టర్, కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి, సిగాచీ పరిశ్రమ యాజమాన్యానికి నోటీసులు జారీ చేసింది. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్రంలోని అన్ని పరిశ్రమల్లో భద్రతా తనిఖీలు నిర్వహించి, కఠిన చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో కోరారు.

ALSO READ: https://teluguprabha.net/telangana-news/married-telangana-man-40-marries-class-8-student/

ప్రమాదానికి కారణాలు – అధికారుల అంచనా:

బ్లో ఎయిర్ హ్యాండ్లర్‌ను శుభ్రపరచడంలో నిర్లక్ష్యం కారణంగా దుమ్ము పేరుకుపోయి, డ్రయ్యర్‌లో ఉష్ణోగ్రతలు అదుపు తప్పి పేలుడు సంభవించి ఉంటుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. పేలుడు సమయంలో 700 నుంచి 800 డిగ్రీల ఉష్ణోగ్రత వెలువడటంతో ప్రమాద తీవ్రత పెరిగిందని భావిస్తున్నారు.

సిగాచీ దుర్ఘటన పారిశ్రామిక భద్రత విషయంలో ప్రభుత్వాలు, యాజమాన్యాలు ఎంతటి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయో మరోసారి కళ్లకు కట్టింది. హైకోర్టు జోక్యంతోనైనా బాధితులకు సత్వర న్యాయం జరిగి, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా కఠినమైన భద్రతా విధానాలు అమలవుతాయని ఆశిద్దాం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad