Thursday, January 15, 2026
HomeతెలంగాణHigh Court on Lands : నిషేధిత భూముల చిట్టా ఏది..? ప్రభుత్వంపై హైకోర్టు...

High Court on Lands : నిషేధిత భూముల చిట్టా ఏది..? ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం!

Telangana prohibited lands list issue : పదేళ్ల క్రితమే అత్యున్నత ధర్మాసనం తీర్పు ఇచ్చినా, ప్రభుత్వ తీరు మారలేదు. నిషేధిత భూముల జాబితాపై అధికారుల నిర్లక్ష్యం వేలాది మంది ప్రజలను కోర్టుల చుట్టూ తిప్పుతోంది. ఈ వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. “రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లేదాకా తమ భూమి నిషేధిత జాబితాలో ఉందో లేదో ప్రజలకు ఎందుకు తెలియడం లేదు? వారిని ఎందుకు ఇలా చీకట్లో ఉంచుతున్నారు..?” అని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది. ఈ తీవ్ర వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు సమస్య ఏంటి..? హైకోర్టు ప్రభుత్వానికి విధించిన గడువు ఎంత..?

- Advertisement -

తెలంగాణలో భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో నెలకొన్న గందరగోళం, అధికారుల జాప్యంపై హైకోర్టు కొరడా ఝుళిపించింది. 

పదేళ్ల నిరీక్షణ.. 5100 పిటిషన్లు : తమ భూమిని రిజిస్టర్ చేయడానికి వెళ్లినప్పుడు, అది సెక్షన్ 22-ఏ కింద నిషేధిత జాబితాలో ఉందని చెప్పి సబ్-రిజిస్ట్రార్లు తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ వేలాది మంది ప్రజలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ అంశంపై ఏకంగా 5,100కు పైగా పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై సోమవారం విచారణ చేపట్టిన జస్టిస్ జూకంటి అనిల్‌కుమార్‌, ప్రభుత్వ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. “నిషేధిత జాబితాలోని భూముల వివరాలను ప్రతి సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో అందుబాటులో ఉంచాలని పదేళ్ల క్రితమే ఫుల్‌బెంచ్ స్పష్టమైన తీర్పు ఇచ్చినా, దాన్ని ఎందుకు అమలు చేయలేదు?” అని న్యాయమూర్తి ప్రభుత్వాన్ని నిలదీశారు.

9 వారాల గడువు.. లేదంటే సీఎస్ హాజరు : ప్రభుత్వ అలసత్వాన్ని తీవ్రంగా పరిగణించిన హైకోర్టు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)కి కీలక ఆదేశాలు జారీ చేసింది. “రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, వారి పరిధిలోని నిషేధిత భూముల పూర్తి జాబితాను 9 వారాల్లోగా తప్పనిసరిగా సంబంధిత సబ్-రిజిస్ట్రార్లకు అందజేసేలా సీఎస్ ఆదేశాలు జారీ చేయాలి. ఆ ఆదేశాల అమలుపై పది రోజుల్లో అఫిడవిట్ దాఖలు చేయాలి. ఒకవేళ ఈ గడువులోగా ఆదేశాలు అమలు చేయడంలో విఫలమైతే, ప్రధాన కార్యదర్శి స్వయంగా కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాల్సి ఉంటుంది” అని స్పష్టం చేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 3వ తేదీకి వాయిదా వేసింది.

త్రిసభ్య కమిటీపై ప్రభుత్వం వాదన : ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ, నిషేధిత భూముల వివాదాల పరిష్కారానికి ఆగస్టు 23న జీవో 98 ద్వారా ఒక త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసినట్లు కోర్టుకు తెలిపారు. ఈ కమిటీ ఫిర్యాదులను పరిశీలించి, రికార్డుల ఆధారంగా భూములను జాబితా నుంచి తొలగించడం లేదా నిర్ధారించడం వంటివి చేస్తుందని వివరించారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి, జీవో అమలును పర్యవేక్షించాలని, కానీ ఫుల్‌బెంచ్ తీర్పు ప్రకారం జాబితాలను మాత్రం తప్పక అందజేయాలని తేల్చిచెప్పారు.

వివాదంలో అధికారుల భూములు : మరోవైపు, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలోని సర్వే నంబర్ 194, 195లలోని భూముల వ్యవహారం తీవ్ర వివాదాస్పదమైంది. సుమారు 700 ఎకరాల ఈ భూదాన్ భూములు 2018 వరకు నిషేధిత జాబితాలో ఉండగా, 2019లో అప్పటి తహసీల్దార్ ప్రైవేటు వ్యక్తుల పేర్లతో పాస్‌బుక్‌లు జారీ చేశారని పిటిషనర్ కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ భూములను పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కొనుగోలు చేయడంతో వివాదం ముదిరింది. ఈ పాస్‌బుక్‌లు ఎలా జారీ అయ్యాయో పూర్తి వివరాలు సమర్పించాలని జస్టిస్ కె. లక్ష్మణ్‌ ప్రభుత్వాన్ని ఆదేశించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News