TG High court: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మాగనూర్ జడ్పీ హైస్కూల్‌లో ఫుడ్ పాయిజన్ ఘటనపై తెలంగాణ హైకోర్టు(TG High court) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పాఠశాలలో ఫుడ్ పాయిజన్ చాలా తీవ్రమైన అంశమని హైకోర్టు సీజే జస్టిస్ అలోక్ అరాధే వ్యాఖ్యానించారు. అధికారులు నిద్రపోతున్నారా అంటూ మండిపడ్డారు. వారంలోనే మూడు సార్లు ఫుడ్ పాయిజన్ అయితే అధికారులు ఏం చేస్తున్నారు..? పిల్లలు చనిపోతే తప్ప స్పందించరా..? అని నిలదీశారు.
ఇలాంటి ఘటనలను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవడం లేదని సీజే పేర్కొన్నారు. హైకోర్టు ప్రశ్నలపై ప్రభుత్వ తరపు న్యాయవాది స్పందిస్తూ వారం రోజుల్లో కౌంటర్ దాఖలు చేస్తామని చెప్పారు. అయితే వివరాల సేకరణకు వారం రోజులు ఎందుకని న్యాయస్థానం మరోసారి ఆగ్రహించింది.
కాగా మాగనూర్ హైస్కూల్‌లో మధ్యాహ్న భోజనంలో ఫుడ్ పాయిజన్ అయి 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. కానీ వారం రోజులు కాక ముందే అదే పాఠశాలలో మళ్లీ 29 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికావడం కలకలం రేపింది. మంగళవారం మధ్యాహ్నం భోజనం తిన్న విద్యార్థులు వాంతులు చేసుకున్నారు. వెంటనే ఉపాధ్యాయులు వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల ప్రాణాలతో రేవంత్ సర్కార్ చెలగాటమాడుతోందని ఫైర్ అయ్యారు.