Saturday, November 15, 2025
HomeతెలంగాణLand registration : ఇంటి నంబరుతో రిజిస్ట్రేషన్లు... కార్యదర్శుల కొర్రీలతో చిక్కులు!

Land registration : ఇంటి నంబరుతో రిజిస్ట్రేషన్లు… కార్యదర్శుల కొర్రీలతో చిక్కులు!

Telangana Gramakantam land registration issues : దశాబ్దాలుగా నలుగుతున్న గ్రామకంఠం, ఆబాదీ భూములకు మోక్షం కల్పిస్తూ ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. కేవలం ఇంటి నంబరు ఆధారంగా ఆస్తులను రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు పచ్చజెండా ఊపింది. అయితే, ప్రభుత్వ సదుద్దేశానికి క్షేత్రస్థాయిలో కొందరు అధికారుల కొర్రీలు గండి కొడుతున్నాయి. రిజిస్ట్రేషన్‌కు అత్యంత కీలకమైన నిరభ్యంతర పత్రం (ఎన్‌వోసీ) కోసం ప్రజలు పంచాయతీ, పురపాలక కార్యాలయాల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నా ఫలితం శూన్యం. అసలు ఈ సమస్యకు మూలం ఎక్కడ ఉంది..? అధికారులు ఎందుకు వెనకడుగు వేస్తున్నారు..? ఈ చిక్కుముడిని విప్పేదెలా?

- Advertisement -

రాష్ట్రవ్యాప్తంగా వేల గ్రామాల్లోని గ్రామకంఠం, ఆబాదీ భూముల్లో (గ్రామాల నిర్మాణాలకు కేటాయించిన భూములు) నివసిస్తున్న వారికి యాజమాన్య హక్కులు కల్పించేందుకు, ఇంటి నంబర్లతోనే రిజిస్ట్రేషన్లు చేసేలా జిల్లా కలెక్టర్లు ఇటీవల సమగ్ర ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, క్షేత్రస్థాయిలో ఈ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. పంచాయతీ కార్యదర్శులు, పురపాలక అధికారులు ఎన్‌వోసీ జారీ చేసేందుకు నిరాకరిస్తుండటమే దీనికి ప్రధాన కారణం.

అధికారులు చెబుతున్న సాకులివే : సర్వే నంబర్లపై అస్పష్టత: చాలా గ్రామాల్లోని ఇళ్లు గతంలో సర్వే నంబర్లు ఉన్న భూముల్లో నిర్మితమయ్యాయి. ఇప్పుడు వాటికి ఇంటి నంబర్లతో ఎన్‌వోసీ ఎలా ఇవ్వాలనే దానిపై కార్యదర్శుల్లో భయం, గందరగోళం నెలకొంది. సర్వే నంబర్ ఉన్న భూమికి ఎన్‌వోసీ ఇస్తే భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు వస్తాయేమోనని వారు వెనకడుగు వేస్తున్నారు.

విచారణ కొరవడింది: నిబంధనల ప్రకారం, దరఖాస్తు చేసుకున్న వారి భూమిని క్షేత్రస్థాయిలో విచారణ (మోఖా ఎంక్వైరీ) చేసి, హద్దులు నిర్ధారించి ఎన్‌వోసీ ఇవ్వాలి. కానీ, భూమిని ఎలా కొలవాలి, హద్దులు ఎలా తేల్చాలనే దానిపై స్పష్టత లేక ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు.

పురపాలికల్లో గందరగోళం: కరీంనగర్ కార్పొరేషన్, జమ్మికుంట, హుజూరాబాద్ వంటి పురపాలికల్లో టౌన్‌ ప్లానింగ్ అధికారులు సైతం ఎన్‌వోసీలు జారీ చేయడం లేదు. యాజమాన్య ధ్రువీకరణ పత్రం ఇవ్వకూడదని మున్సిపల్ శాఖ కమిషనర్ కార్యాలయం నుంచి ఆదేశాలు ఉన్నాయని, మరోవైపు కలెక్టర్ ఉత్తర్వులున్నాయని, ఏది పాటించాలో తెలియక అయోమయంలో ఉన్నామని వారు వాపోతున్నారు.

ప్రజల గోడు పట్టేదెవరు : అధికారుల తీరుతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆస్తిని అమ్ముకోవాలన్నా, పిల్లల పెళ్లిళ్లకు, ఇతర అవసరాలకు ఆస్తిపై రుణం తీసుకోవాలన్నా రిజిస్ట్రేషన్ పత్రం తప్పనిసరి. ఎన్‌వోసీ రాకపోవడంతో ఏ పనీ జరగక లబోదిబోమంటున్నారు. ముఖ్యంగా, ఇంటి యజమాని మరణిస్తే, ఆ ఆస్తిని వారసుల పేరిట మార్చుకోవడం గగనంగా మారింది. దీనిపై చాలా మంది కార్యదర్శులకు కూడా అవగాహన కొరవడటం సమస్యను మరింత జఠిలం చేస్తోంది.

పరిష్కారం దిశగా అడుగులు పడాలి : ప్రభుత్వం తక్షణమే ఈ విషయంలో జోక్యం చేసుకుని, క్షేత్రస్థాయి అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వమే ఒక ప్రత్యేక సర్వే నిర్వహించి, భూముల స్వభావాన్ని గుర్తించి రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయాలి. యాజమాన్య హక్కులు, వారసత్వ బదిలీ ధ్రువపత్రాల జారీ ప్రక్రియను సులభతరం చేసేలా పంచాయతీ రాజ్ శాఖ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలి.
అధికారుల్లో నెలకొన్న భయాలు, అపోహలను తొలగించి, విధివిధానాలపై స్పష్టమైన శిక్షణ ఇవ్వాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad