Sunday, November 16, 2025
HomeతెలంగాణTelangana Politics: రేపు పరేడ్‌ గ్రౌండ్‌లో బీజేపీ సభ.. విమోచన దినోత్సవానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు

Telangana Politics: రేపు పరేడ్‌ గ్రౌండ్‌లో బీజేపీ సభ.. విమోచన దినోత్సవానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు

Telangana Liberation Day Sep 17: తెలంగాణలో సెప్టెంబర్ 17 సమీపిస్తుందంటే చాలు రాజకీయం వేడెక్కుతుంది. అప్పట్లో నిజాం ఆధీనంలోని హైదరాబాద్‌ సంస్థానం ఆపరేషన్‌ పోలో ద్వారా భారత్‌లో విలీనమైన సంగతి తెలిసిందే. 1948 సెప్టెంబర్‌ 17న అధికారికంగా హైదరాబాద్‌ రాజ్యం భారత్‌లో విలీనమైంది. దీంతో, ఈ రోజును ఒక్కో పార్టీ ఒక్కో విధంగా జరుపుకుంటుంది. విలీనమా? విమోచనమా? విద్రోహమా? అనే అంశంపై ఒక్కో పార్టీ ఒక్కో విధంగా రాజకీయం చేస్తోంది. ఎవరి వెర్షన్‌ ఎలా ఉన్నా సెప్టెంబర్‌ 17 వచ్చిందంటే చాలు బీజేపీ పెద్ద ఎత్తున హడావుడి చేస్తుంది. సెప్టెంబర్ 17 ముమ్మాటికీ తెలంగాణకు విమోచన దినోత్సవమని బీజేపీ గట్టిగా చెబుతుండగా, ప్రత్యర్థి పార్టీలు మాత్రం బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ, సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి బీజేపీ సిద్ధమైంది. కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో గత రెండేళ్లుగా ఈ వేడుకలను నిర్వహిస్తున్న బీజేపీ, ఈసారి కూడా భారీగా ఏర్పాట్లు చేస్తోంది. సికింద్రాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో ఆర్మీ కవాతు, సాంస్కృతిక నృత్యాలతో ‘హైదరాబాద్ లిబరేషన్ డే’ పెద్ద ఎత్తున నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఈ కార్యక్రమానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. “సెప్టెంబర్ 17 ముమ్మాటికీ విమోచనమే’ అనే పుస్తకాన్ని మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్‌ నేత విద్యాసాగర్ ఆవిష్కరించారు. సెప్టెంబర్ 17న గ్రామగ్రామాన జాతీయ జెండాలు ఎగురవేయాలని, తెలంగాణ చరిత్రను తెలియజేసే వర్చువల్ మ్యూజియంను ప్రజలకు చూపించాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చింది.

- Advertisement -

పరేడ్‌ గ్రౌండ్స్‌లో విమోచన దినోత్సవ వేడుకలు..

బీజేపీ నాయకుడు గూడూరు నారాయణరెడ్డి తీసిన రజాకార్ సినిమా, జాతీయవాద కవులు రాసిన విమోచన దినోత్సవ అంశాలపై పుస్తకావిష్కరణలు, ఫోటో ఎగ్జిబిషన్లతో బీజేపీ భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తోంది. నిజాంకు వ్యతిరేకంగా పోరాడినవారిని సత్కరించడం, ముఖ్యమైన చారిత్రక ప్రదేశాలను సందర్శించడం వంటి కార్యక్రమాలను కూడా చేపట్టనుంది. అంతేకాకుండా, అన్ని జిల్లాల నుంచి పరేడ్‌ గ్రౌండ్‌కు పెద్ద ఎత్తున శ్రేణులను తరలించాలని ప్రణాళికలు రచిస్తోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు సెప్టెంబర్‌ 17ను విమోచనమా? విద్రోహమా? విలీనమా? అనే విషయంపై స్పష్టతనివ్వకుండా రాజకీయాలు చేస్తున్నాయని, ఈ వైఖరిని ప్రజల్లో ఎండగట్టాలని శ్రేణులను కోరింది. అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను నిర్వహించాలని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తోంది. మరోవైపు, సెప్టెంబర్ 17పై బీజేపీ తప్పుడు వాదనలు చేస్తోందని సీపీఐ నేత నారాయణ విమర్శించారు. తెలంగాణ గవర్నర్ బీజేపీకి సేవకుడిలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సెప్టెంబర్ 17 గురించి మాట్లాడే అర్హత బీజేపీకి లేదని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హెచ్ అభిప్రాయపడ్డారు. సెప్టెంబర్ 17 విమోచనం కాదని, విలీనమేనని ఆయన వాదించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad