Lightning strikes in Telangana : ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షం రాష్ట్రంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. పొలం పనులే జీవనాధారంగా బతుకుతున్న వారిపై పిడుగుల రూపంలో మృత్యువు పంజా విసిరింది. గంటల వ్యవధిలో రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో ఏడుగురు అసువులు బాశారు. కళ్ల ముందే తమ వారి ప్రాణాలు గాలిలో కలిసిపోవడంతో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. అసలు ఈ ఘోర దుర్ఘటనలు ఎక్కడెక్కడ జరిగాయి..? పొలం పనులే వారి పాలిట యమపాశంగా ఎలా మారాయి..?
జిల్లాకో విషాదం.. కుటుంబాల్లో పెను శోకం : పొలం పనులకు వెళ్లిన కూలీలు, రైతులు ఇళ్లకు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా బుధవారం చోటుచేసుకున్న పిడుగుపాటు దుర్ఘటనలు పలు కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపాయి.
నిర్మల్‌లో ముగ్గురు బలి: నిర్మల్ జిల్లా, పెంబి మండలం ఎంగేలాపూర్ శివారులో ఈ ఘోరం జరిగింది. పొలం పనులు ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా అల్లెపు ఎల్లయ్య, ఆయన భార్య ఎల్లవ్వ, మరో వ్యవసాయ కూలీ వెంకటిపై పిడుగు పడింది. దీంతో ముగ్గురూ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.
గద్వాలలో ముగ్గురి మృతి: జోగులాంబ గద్వాల జిల్లా, అయిజ మండలం భూంపురం గ్రామంలో పత్తి చేలో పనిచేస్తున్న కూలీలపై పిడుగు విరుచుకుపడింది. ఒక్కసారిగా వర్షం మొదలవడంతో, సమీపంలోని ఓ తాటిచెట్టు కిందకు వెళ్లారు. అదే వారి పాలిట మృత్యుపాశమైంది. పిడుగు నేరుగా చెట్టుపై పడటంతో, భూంపురం గ్రామానికి చెందిన పార్వతమ్మ, సర్వేస్, సౌభాగ్య అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడగా, వారిని చికిత్స నిమిత్తం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో భూంపురంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఖమ్మంలో ఒకరు: ఖమ్మం జిల్లాలోనూ పిడుగుపాటుకు ఒకరు మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు. జిల్లాలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఈ ఘటనలు జరిగినట్లు సమాచారం.
చెట్టు నీడే మృత్యుశయ్యగా : గద్వాల జిల్లాలో జరిగిన ఘటన అందరినీ కలచివేసింది. వర్షం నుంచి తలదాచుకునేందుకు చెట్టు కిందకు వెళ్లడమే వారు చేసిన తప్పైంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతున్నప్పుడు చెట్ల కింద, ఎత్తైన ప్రదేశాల్లో ఉండటం అత్యంత ప్రమాదకరమని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నా, అవగాహన లోపంతో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. సమీపంలోని రైతులు వెంటనే స్పందించి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించినా, ముగ్గురి ప్రాణాలను దక్కించుకోలేకపోయారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గద్వాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.


