Telangana Liquor Shops: తెలంగాణలో 2025–27 సంవత్సరానికిగాను 2,620 మద్యం దుకాణాల లైసెన్సుల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కీలక ఘట్టానికి చేరుకుంది. పలువురి విజ్ఞప్తి మేరకు పొడిగించిన గడువు రేపు (గురువారం) సాయంత్రం 5 గంటలకు ముగియనుంది.
అంచనాలకు మించిన రెస్పాన్స్:
రాష్ట్రంలో ఇటీవల జరిగిన బీసీ బంద్ మరియు బ్యాంకుల బంద్‌ల కారణంగా దరఖాస్తు చేసుకోలేకపోయినట్లు వచ్చిన ఫిర్యాదులతో ఎక్సైజ్ శాఖ ఈ గడువును అక్టోబర్ 23వ తేదీ వరకు పొడిగించింది. ఈ పొడిగింపుతో దరఖాస్తుల సంఖ్య భారీగా పెరిగింది. బుధవారం నాటికి అందిన దరఖాస్తుల సంఖ్య 90,316కు చేరింది. చివరి రోజు కావడంతో ఈ సంఖ్య లక్ష మార్కును దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ప్రభుత్వ ఖజానాకు భారీ ఆదాయం:
ప్రభుత్వం ఈసారి ఒక్కో దరఖాస్తు ఫీజును గతంలో ఉన్న రూ. 2 లక్షల నుంచి ఏకంగా రూ. 3 లక్షలకు పెంచింది. ఇప్పటివరకు అందిన దరఖాస్తుల ద్వారా ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ. 2,700 కోట్ల (90 వేల దరఖాస్తులకు) భారీ ఆదాయం సమకూరినట్లు తెలుస్తోంది.
ఈ దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన తర్వాత, డ్రా నిర్వహణ తేదీని సైతం మార్చారు. ఈ నెల 23న జరగాల్సిన డ్రాను అక్టోబర్ 27వ తేదీకి వాయిదా వేశారు. డ్రాలో దుకాణాలు దక్కించుకున్నవారు 2025 డిసెంబర్ 1 నుండి 2027 నవంబర్ 30 వరకు రెండేళ్ల పాటు మద్యం విక్రయాలు నిర్వహించుకోవచ్చు. దరఖాస్తుల రద్దీకి అనుగుణంగా అన్ని జిల్లా కార్యాలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు వెల్లడించారు.


