Telangana liquor license lottery : తెలంగాణ వ్యాప్తంగా వేలాది మంది వ్యాపారుల గుండెల్లో ఉత్కంఠ రైళ్లు పరుగెడుతున్నాయి. ఎవరి అదృష్టం ఎలా ఉందో తేల్చే ఘడియలు రానే వచ్చాయి. రాష్ట్రంలోని 2,620 మద్యం దుకాణాల లైసెన్సుల కేటాయింపు కోసం రేపు లాటరీ జరగనుంది. లక్షకు చేరువలో దరఖాస్తులు వెల్లువెత్తడంతో ప్రభుత్వ ఖజానాకు కాసుల వర్షం కురిసింది. మరి ఇంతటి తీవ్రమైన పోటీలో ఆ అదృష్ట దేవత ఎవరిని వరించనుంది? ఏ ప్రాంతంలో పోటీ తారస్థాయికి చేరింది? కొత్త విధానంలోని నిబంధనలు ఏంటి?
దరఖాస్తుల వెల్లువ.. పోటీ తీవ్రం : రాష్ట్రంలోని 2,620 మద్యం దుకాణాలకు గాను ఏకంగా 95,137 దరఖాస్తులు రావడం ఈ వ్యాపారంపై ఉన్న ఆసక్తికి నిలువుటద్దం పడుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో పోటీ తీవ్రంగా ఉంది.
అత్యధిక పోటీ: శంషాబాద్ ఎక్సైజ్ జిల్లా పరిధిలోని 100 దుకాణాలకు ఏకంగా 8,536 దరఖాస్తులు వచ్చాయి. అంటే ఒక్కో దుకాణానికి సగటున 85 మందికి పైగా పోటీ పడుతున్నారు.
తర్వాతి స్థానాల్లో: సరూర్‌నగర్‌లో 134 దుకాణాలకు 7,845, మేడ్చల్‌లో 114 దుకాణాలకు 6,063, మల్కాజిగిరిలో 88 దుకాణాలకు 5,168 చొప్పున దరఖాస్తులు దాఖలయ్యాయి.
అత్యల్ప పోటీ: అత్యల్పంగా కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 32 దుకాణాలకు కేవలం 680 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. రేపు ఆయా జిల్లాల కలెక్టర్ల సమక్షంలో పారదర్శకంగా లాటరీ ప్రక్రియను నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ కార్యక్రమంతో ఎందరో వ్యాపారుల భవితవ్యం తేలనుంది.
కొత్త విధానంలోని ముఖ్యాంశాలు : ప్రభుత్వం ఈసారి మద్యం విధానంలో కొన్ని కీలక మార్పులు చేసింది.
రిజర్వేషన్లు: రాష్ట్రంలోని మొత్తం 2,620 దుకాణాల్లో గౌడ సామాజికవర్గానికి 15% (393 దుకాణాలు), ఎస్సీలకు 10% (262), ఎస్టీలకు 5% (131) చొప్పున రిజర్వేషన్లు కేటాయించారు.
అదనపు పన్ను: మద్యం దుకాణం వార్షిక టర్నోవర్, లైసెన్సు రుసుముకు పది రెట్లు దాటితే, ఆ అదనపు విక్రయాలపై 10% ‘షాప్ టర్నోవర్ ట్యాక్స్’ చెల్లించాల్సి ఉంటుంది.
పనివేళలు: రాష్ట్రవ్యాప్తంగా దుకాణాలను ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు తెరిచేందుకు అనుమతి ఉంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో మాత్రం రాత్రి 11 గంటల వరకు అమ్మకాలు జరుపుకోవచ్చు.
వాక్-ఇన్ స్టోర్స్: అదనంగా రూ.5 లక్షలు చెల్లించి, సూపర్ మార్కెట్ల తరహాలో ‘వాక్-ఇన్’ సౌకర్యంతో దుకాణాలను ఏర్పాటు చేసుకునే వెసులుబాటును కల్పించారు.
ప్రత్యేక రుసుము: ప్రతీ దుకాణం ఏటా రూ.5 లక్షల స్పెషల్ రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్‌ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిబంధనల మధ్య, లాటరీలో గెలిచి ‘లక్కీ భాస్కరులు’గా ఎవరు నిలుస్తారోనని రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది.


